గోల్ మాల్.. (అనంతపురం)
అనంతపురం, డిసెంబర్ 04: పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. జిల్లా సర్వజన ఆస్పత్రిలో ‘ఆరోగ్యశ్రీ’ నిధుల్లో భారీ ఎత్తున గోల్‌మాల్ జరిగింది. కోట్లాది రూపాయల నిధులకు లేక్కే లేకుండా పోయింది. అసలు దేనికి ఖర్చు పెట్టారనే దానిపై సమగ్ర వివరాలేవీ లేవు. నిధుల నిర్వహణ.. వ్యయంపై ప్రభుత్వం సమగ్ర వివరాలతో కూడిన మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని తుంగలో తొక్కారు. ఈ పథకం ఆరంభం నుంచి ‘ఆడిట్’ లేకపోవడంతో నిధుల వ్యయంలో చేతివాటం ప్రదర్శించారు. గత పుష్కర కాలంలో నిర్వహించిన శస్త్ర చికిత్సల క్లైయిమ్ నిధులు రూ.39.51 కోట్లు సర్వజన ఆస్పత్రి పేరుపై ఆరోగ్యశ్రీ ట్రస్టు మంజూరు చేసింది. కానీ... ఆస్పత్రి బ్యాంకు ఖాతాలో కేవలం రూ.60 లక్షలు మాత్రమే నిల్వ ఉంది. అంటే.. రూ.కోట్ల నిధులు దేనికి.. ఎప్పుడు వ్యయం చేశారనే దానిపై సమగ్ర వివరాలేవీ లేవు. 2006లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్ర స్థాయిలో అనంతలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. తొలి ఏడాదిలో ఆర్థో, సర్జరీ.. వంటి కీలక విభాగాలకు మాత్రమే వర్తింపజేశారు. కాలక్రమేణా విస్తరించారు. ఇప్పుడు అనేక వ్యాధులు, శస్త్ర చికిత్సలకు అమలు చేస్తున్నారు. ఇలా.. 2007లో 318 శస్త్ర చికిత్సలకు క్లైయిమ్ పొందారు. గడిచిన 12 ఏళ్లలో ఒక్క సర్వజన ఆస్పత్రిలోనే 19,453 శస్త్ర చికిత్సలు చేశారు. వీటికి క్లైయిమ్‌ల కింద రూ.39.51 కోట్లు ఆస్పత్రి పేరుపై మంజూరైంది. ఆరోగ్యశ్రీ విభాగాల అభివృద్ధి, చిన్నచిన్న వైద్య పరికరాలు కొనుగోలు, మందులు.. వంటి వాటికి వెచ్చించాలి. మరో వైపు... కొన్ని విభాగాల కేసష్‌ీట్లు గల్లంతయ్యాయి. దీంతో ప్రోత్సాహకం చెల్లింపునకు తీవ్ర ఇబ్బంది అయింది. ఆస్పత్రి వాటాగా విభజించిన 45 శాతం నిధులు ఏమయ్యాయో అధికార యంత్రాంగానికే సరిగా తెలియదు. ఒకవేళ ఖర్చు పెట్టినా... దేని కోసమన్న దానిపై తగిన రికార్డు, దస్త్రాలు సరిగా లేవు. ఇక ప్రోత్సాహకం కింద చెల్లించే 35 శాతం నిధుల చెల్లింపులోనూ ఇష్టారాజ్యంగా చేశారు. ఉదాహరణకు... ఆర్థో విభాగంలో 18 మంది వైద్యులు ఉంటే.. ఇందులో శస్త్ర చికిత్సలు చేసినా చేయకపోయినా అందరికీ డబ్బు పంపిణీ సాగింది. దీర్ఘకాలిక సెలవులో ఉన్నా, శస్త్ర చికిత్స చేయని వారికి కూడా డబ్బు ఇచ్చారు. ఇలా ప్రతి విభాగంలోనూ జరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి అన్ని విభాగాలకు ‘ప్రోత్సాహకం’ కింద రూ.72 లక్షలు చెల్లించాలి. అదిగో...ఇదిగో అని దాటవేస్తున్నారు. కానీ... వీరికి చెందిన నిధులు లేవు. ఇప్పుడు సదరు ఖాతాలో రూ.60 లక్షలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ నిధులు 45 శాతానివా... 35 శాతానివా తెలీదు. ఇక ప్రతి ఏటా ఆడిట్ జరగాలి. ఆరంభం నుంచి దీని ఊసేలేదు. ఇదే అవినీతి అధికారులకు అనువుగా మారింది.