చదువు సరే.. మరి సౌకర్యాలు..? (పశ్చిమగోదావరి)
కోవూరు, డిసెంబర్ 04: పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ చదువు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత ప్రజల నుంచి హర్షం వ్యక్తమైంది. కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువుకు మార్గం సుగమమైందన్న ఆనందం ఆవిరవుతోంది. కళాశాలను ఏర్పాటు చేసి ఆరు నెలలైనా తరగతులు పట్టాలెక్కలేదు. మౌలిక సదుపాయాలు కూడా లేవు. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, కొవ్వూరులో డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం నుంచి కొవ్వూరు వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంటర్ తర్వాత చదువులకు స్వస్తి పలకాల్సి వచ్చేది. నియోజకవర్గ పరిధిలో 42 గ్రామాలు, పట్టణ పరిధిలో 23 వార్డులు ఉన్నాయి. పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల, చాగల్లు, వేగేశ్వరపురం జూనియర్ కళాశాలల నుంచి ఏటా సుమారు 800 మంది ఇంటర్ చదువు పూర్తిచేస్తున్నారు. కొవ్వూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని నాలుగు అదనపు గదుల్లో డిగ్రీ తరగతులను ఈ ఏడాది జులైలో ప్రారంభించారు. అన్ని తరగతులు సక్రమంగా జరగాలంటే ఏడు గదులు అవసరమని గుర్తించినా అవకాశం లేక జూనియర్ కళాశాలకు చెందిన నాలుగు గదులను కేటాయించారు. బీఏ (హెచ్‌ఈసీ), బీకాం (జనరల్), బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (బీజెడ్సీ) విభాగాల్లో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు స్వీకరించారు. అన్ని గ్రూపుల్లో 210 మంది ప్రవేశానికి అవకాశం ఉన్నా సరైన అవగాహన లేక, కళాశాల ఆలస్యంగా ప్రారంభించిన కారణాలతో ప్రస్తుతం 92 మంది విద్యనభ్యసిస్తున్నారు. కళాశాలను ప్రారంభించి ఐదు నెలలైనా ఇప్పటివరకు ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ప్రిన్సిపల్, అధ్యాపకులు, పాలనా విభాగ సిబ్బందిని నియమించలేదు. కాలేజ్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీనీ ఏర్పాటు చేయలేదు. కళాశాల నిర్వహణ, అభివృద్ధి కార్యాచరణ పట్టాలెక్కలేదు. సిబ్బంది నియామకమైతేనే బడ్జెడ్ విడుదలవుతుంది. అప్పుడే ఆధునాతన సొంత భవనం నిర్మాణమవుతుంది. తరగతుల నిర్వహణకు ప్రిన్సిపల్, 12 మంది అధ్యాపకులు, ఎనిమిది మంది బోధనేతర సిబ్బందిని నియమించాలి. ప్రత్యేకాధికారి పేరుతో ప్రిన్సిపల్‌ను, డిప్యుటేషన్ విధానంలో వివిధ ప్రాంతాల నుంచి అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారానికి రెండు రోజుల చొప్పున వీరు బోధన కొనసాగిస్తున్నారు. దీంతో సిలబస్ పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కళాశాలలో కనీసం తాగేందుకు నీరు లేదు. విద్యుత్తు సరఫరా, కంప్యూటర్ సౌకర్యాలు లేవు. విద్యార్థులు మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. పాలనా విభాగానికి కేటాయించిన గదిలో విలువైన పుస్తకాలు, దస్త్రాలకు రక్షణ కరవైంది. పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాలతో కళాశాల ప్రాంగణం అధ్వాన పరిస్థితులకు చిరునామాగా మారింది. డిప్యుటేషన్‌పై అధ్యాపకులు ఉన్నా తరగతుల నిర్వహణకు సరిపడా గదులు లేక బోధన ఇబ్బందికరంగా మారుతోంది.