YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అభివృద్ధికి నిధులేవీ..? (ప్రకాశం)

అభివృద్ధికి నిధులేవీ..? (ప్రకాశం)

అభివృద్ధికి నిధులేవీ..? (ప్రకాశం)
ఒంగోలు, డిసెంబర్ 04 : పట్టణాలు, నగరాల అభివృద్ధికి గతంలో చేపట్టిన బృహత్తర పథకాలకు నిధుల సమస్య తలెత్తింది. పైగా వీటి అమలును అధికారులు పక్కన పెట్టారు. అమృత్‌ పథకం 2016 నుంచి 2020 వరకు కొనసాగాల్సి ఉండగా- ఈ ఏడాదితో అర్ధంతరంగా నిలిపివేశారు. ఇప్పటి వరకు మంజూరైనవి మినహా.. కొత్తగా ఏ పనులూ చేపట్టవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. అదే తరహాలో స్మార్ట్‌ సిటీ కింద ఇప్పటి వరకు వచ్చిన నిధులను వినియోగించుకుంటున్నారు. కొత్త ప్రతిపాదనలు మొత్తం రద్దు చేశారు. ఇక క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీం(సిప్‌) కింద చేపట్టిన పనులన్నీ ప్రతిపాదన దశలోనే ఉండిపోయాయి. అమృత్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కొన్ని పట్టణాలు, నగరాలను ఇందులో చేర్చగా- ఒంగోలు స్థానం పొందింది. కేంద్రం 50 శాతం నిధులు ఇస్తే... రాష్ట్రం 20 శాతం, స్థానిక సంస్థలు 30 శాతం భరించాలి. స్థానిక సంస్థలో తలసరి ఆదాయాన్ని బట్టి వాటాల్లో కొద్దిగా మార్పులు ఉంటాయి. ఆ నిధులతో ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దవచ్చని ఆశించారు. తొలి దశలో వచ్చిన రూ. 69 కోట్లతో పార్కులు, గుండ్లకమ్మ నుంచి తాగునీటి పైప్‌లైన్, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. కాకతీయనగర్‌లో రూ. 36 లక్షలతో, నెహ్రూనగర్‌లో రూ. 50 లక్షలతో, చెన్నకేశవస్వామి లేఅవుట్‌లో రూ. 50 లక్షలతో పార్కులు నిర్మించారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఇచ్చేందుకు చేపట్టిన పథకానికి రూ. 60 లక్షలు వ్యయం చేశారు. మొత్తం మీద 6,903 కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. తెల్లరేషన్‌ కార్డు కలిగిన వారికి రూ. 200 డిపాజిట్‌తో కుళాయిలు మంజూరు చేశారు. మరో రెండు వేల మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారు. ఇంతలో ఈ పథకానికి నిధుల సమస్య తలెత్తింది. గుండ్లకమ్మ నుంచి పైప్‌లైన్‌ వేయడానికి మొత్తం రూ. 123 కోట్లతో టెండర్లు పిలిచి.. పనులు చేపట్టారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు విడుదల చేసింది. రాష్ట్రం, నగరపాలక సంస్థ వాటా చెల్లించలేదు. ఇప్పటి వరకు జరిగిన పనులకు గుత్తేదారుకు రూ. 30 కోట్లు చెల్లించాల్సి ఉండగా... రూ. 15 కోట్లు చెల్లించారు. మిగిలిన బిల్లులు రాక పనులు నిలిపివేశారు.  పైప్‌లైన్, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, ఫిల్టరేషన్‌ ప్లాంట్‌ పనులు కొనసాగాలంటే రూ. 70 కోట్లు అత్యవసరం. నగరపాలక సంస్థ వాటా చెల్లించలేక చేతులెత్తేసింది ఆకర్షణీయ నగరాల జాబితాలో ఒంగోలు ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీ పథకం కింద ఏటా రూ. 33 కోట్ల నిధులు కేటాయించాలి. ఈ పథకం ప్రారంభమై మూడేళ్లయినా నగరానికి రూ. ఎనిమిది కోట్లు మాత్రమే అందాయి. వాస్తవానికి ఇప్పటికి రూ. 99 కోట్లు రావాలి. ఆ నిధులొస్తాయని భావించి.. ముందుగానే ప్రణాళికలు తయారు చేశారు. ట్రంకు రోడ్డును మోడల్‌గా తీర్చిదిద్దడం, ఐకాన్‌ టవర్ల నిర్మాణం, ఎలక్ట్రానిక్‌ సైకిళ్ల కొనుగోలు, మైథలాజికల్‌ పార్కు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వచ్చిన నిధుల్లో రూ. 3.81 కోట్లతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఒక్కటే పూర్తి చేశారు. మిగిలిన నిధులతో కూరగాయల మార్కెట్‌ను ఆధునికీకరించారని తాజాగా ప్రతిపాదించారు. మిగిలిన పనులన్నీ నిలిపివేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర స్థాయిలో నిలిపివేసినందున.. ఇక నిధులు కూడా రావని అధికారులు చెబుతున్నారు. 

Related Posts