మూల విరాట్ కు ఎలాంటి అపచారం జరగలేదు
యాదాద్రి డిసెంబర్ 04
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అపచారాలు జరిగాయని ఒక తెలుగు దిన పత్రిక బ్యానర్ కథనం రాయటం చాలా బాధ కలిగించింది అని యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వార్తలను ప్రచురించడం బాధాకరం. తప్పుడు కథనాలు రాయడం మంచిది కాదు. గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్ కు ఎలాంటి అపచారం జరగలేదు. మూలవిరాట్‌ను చెక్కలేదు. ఏడాది క్రితమే మూలవిరాట్‌కు ఉన్న సింధూరాన్ని తొలగించాం. దీంతో స్వామి వారు దేదీప్యమానంగా కనబడుతున్నారు. 40 ఏళ్లుగా స్వామి వారికి కైంకర్యాలు చేస్తున్నాను. స్వామి వారికి ఎలాంటి కళంకం జరగలేదు. తిరుపతి, శ్రీశైలం ఆలయాల్లో కూడా స్వామి వార్ల మూలవిరాట్ పై ఉన్న చందనాన్ని, సింధూరాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తారు. ఇది సర్వసాధారణమైన విషయం అని నరసింహాచార్యులు స్పష్టం చేశారు.