చంద్రయాన్ ముక్కలను ఇస్రోనే కనిపెట్టింది
బెంగళూర్, డిసెంబర్ 4,
ఃచంద్రుడి ఉపరితలంపై దిగుతూ భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన ఇస్రో చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ ఆచూకీని గుర్తించినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, విక్రమ్ జాడను తాము ఎప్పుడో గుర్తించామని ఇస్రో ఛైర్మన్ కే శివన్ బుధవారం ప్రకటించారు. నాసా ప్రకటనను తోసిపుచ్చిన ఆయన.. విక్రమ్ ఆచూకీ కనుగొన్నది నాసా కాదని, ల్యాండర్ శకలాలను అంతకు ముందే గుర్తించామని తెలిపారు. విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ గుర్తించిందని, ఈ విషయాన్ని ఇప్పటికే ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేశామని, కావాలంటే మీరు కూడా చూడొచ్చని శివన్ వ్యాఖ్యానించారు.విక్రమ్ ల్యాండర్ ఆచూకీ దొరికినట్లు నాసా మంగళవారం ప్రకటించింది. చంద్రుడి ఉపరితలంపై దిగుతూ బలంగా ఢీకొట్టడంతో శకలాలు చెల్లాచెదురయి కిలోమీటర్ వరకు పడిపోయినట్టు తెలిపింది. చెన్నైకు చెందిన మెకానికల్ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ తొలుత నాసా ఎల్ఆర్‌వో కెమెరా తీసిన ఫోటోలను పరిశీలించి విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొందినాసా ఎల్ఆర్‌వో తీసిన ఫోటోల్లో నీలి రంగులో ఉన్న చుక్కలు విక్రమ్ వల్ల ప్రభావితమైన చంద్రుడి ఉపరితలాన్ని.. ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చుక్కలు విక్రమ్ శకలాల్ని సూచిస్తున్నాయి. ‘ఎస్’తో సూచించిన శకలం షణ్ముగం సుబ్రహ్మణియన్ కనిపెట్టింది. విక్రమ్ శకలాలు పడడానికి ముందు, పడిన తర్వాత చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో కూడా నాసా చిత్రాలు విడుదల చేసింది.కాగా, విక్రమ్ ల్యాండర్ సెప్టెంబరు 7న ఉపరితలంపై దిగుతూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన మూడు రోజుల తర్వాత సెప్టెంబరు 10న ల్యాండర్ గురించి ఇస్రో తమ వెబ్‌సైట్‌లో ఇలా పేర్కొంది. ‘చంద్రయాన్-2 ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది. కానీ, దానితో ఇంకా కమ్యూనికేషన్ జరగలేదు. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని తెలిపింది. అందుకే నాసా కంటే ముందే విక్రమ్ ల్యాండర్‌ను తాము గుర్తించామని శివన్ చెబుతున్నారు. అయితే, విక్రమ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్న మాత్రం ఇస్రో స్పష్టంగా వెల్లడించలేదు.రెండు రోజుల కిందట నాసా విడుదల చేసిన ఫోటోల్లో ల్యాండర్ పూర్తిగా విచ్ఛిన్నమైనట్లు కన్పించింది. సెప్టెంబరు 7న విక్రమ్ హార్డ్ ల్యాండ్ అయిన ప్రాంతానికి సుమారు 750 మీటర్ల దూరంలో ఈ శిథిలాలను గుర్తించారు. విక్రమ్‌తో భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన తర్వాత దాని ఆచూకీ కోసం నాసా ఎల్ఆర్ఓ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో సెప్టెంబరు 11, అక్టోబరు 14, 15, నవంబరు 11న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు నిర్దేశించిన ప్రదేశం మీదుగా నాసా ఎల్‌ఆర్‌వో ప్రయాణించి కొన్ని ఫొటోలను తీసింది.చంద్రుడి ఉపరితలంపై దిగుతూ భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన విక్రమ్ ల్యాండర్ జాడ కోసం అంతరిక్ష శాస్త్రవేత్తలు, సంస్థలు దాదాపు మూడు నెలలు ముమ్మరంగా శోధించాయి. అయితే, నాసా ఎల్ఆర్‌వో పంపిన ఫోటోల ఆధారంగా తొలిసారి చెన్నైకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ షణ్ముగం సుబ్రమణ్యం (33) చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించాడు. షణ్ముగం చెన్నైలోని లెనొక్స్ ఇండియా టెక్నాలజీ సెంటర్‌లో టెక్నికల్ ఆర్కెటెక్ట్‌గా పనిచేస్తున్నారు.సుబ్రమణ్యం నాసా లూనార్ రీకనైసాన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్‌వో) సెప్టెంబరు 17, అక్టోబరు 14,15, నవంబరు 11న తీసిన ఫోటోలను పలు వారాల పాటు పరిశీలించి విక్రమ్ ల్యాండర్ శకలాలను షణ్ముగం గుర్తించారు. ఈ సమాచారాన్ని నాసాకు తెలియజేయగా, కొద్ది రోజుల తర్వాత దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ యువ శాస్త్రవేత్తకు నాసా ఎల్‌ఆర్ఓ మిషన్ డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లార్ ఓ లేఖ రాశారు. జులై 22న జీఎస్ఎల్వీ మార్క్ 3ఎంకే 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను ప్రయోగించారు