ఇక మిల్లుల్లో సార్టెక్స్ విధానం
శ్రీకాకుళం, డిసెంబర్ 5,
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీపై పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యమైన సన్న బియ్యం పంపిణీలో కీలకమైన రైసు మిల్లుల ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అధునిక టెక్నాలజీగా భావించే సార్టెక్స్ విధానంలో ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాల్లో అమలు చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్టమ్రంతటా అమలు చేయనున్నారు. నాణ్యమైన బియ్యం కోసం కీలకమైన సార్టెక్స్ విధానాన్ని రైసు మిల్లుల్లో అమలు చేసేందుకు ప్రతిపాదించింది. రాష్ట్రంలో 1650 రైసు మిల్లులు ఉన్నాయి. వీటిలో ఆధునిక సాంకేతిక విధానంగా భావించే సార్టెక్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రతిపాదించింది. ఈమేరకు రైసు మిల్లర్లతో సమావేశాలు నిర్వహించింది. ఇందుకు దాదాపు 500 మిల్లర్లు ముందుకు వచ్చారు. మిల్లుల ఆధునీకరణకు దాదాపు 60 లక్షల రూపాయలు వరకూ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. దీంతో కొంతమంది మిల్లర్లు మాత్రమే ముందుకు వచ్చారు. ఇప్పటి వరకూ ప్రజా ప్రంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే బియ్యంలో 20 శాతానికి మించి నూకలు ఉంటున్నాయి.