YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

9వ తేదీపైనే అందరి దృష్టి

9వ తేదీపైనే అందరి దృష్టి

9వ తేదీపైనే అందరి దృష్టి
బెంగళూర్, డిసెంబర్ 5  
కర్ణాటక ఉప ఎన్నికలు ముగిశాయి. ప్రధానంగా ఈ ఎన్నికలు పార్టీ మారిన వారి జాతకాలను నిర్ణయిస్తాయి. మొత్తం 15 నియోజకవర్గాల్లో ఎన్నిక జరుగుతుండగా పదమూడు స్థానాల్లో గతంలో రాజీనామా చేసి అనర్హత వేటు పడిన వారే కావడం విశేషం. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ ల నుంచి పోటీ చేసిన వీరికి బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా వీరికి తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని ముఖ్యమంత్రి యడ్యూరప్ప హామీ ఇచ్చారు. అయితే పదిహేను నియోజకవర్గాలను యడ్యూరప్ప అంతా తానే అయి ముందుండి చూసుకుంటున్నారు. జాతీయ స్థాయి నేతలు కూడా పెద్దగా ప్రచారానికి ఎవ్వరూ రాలేదు. ఈ ఎన్నికల్లో కనీసం ఎనిమిది స్థానాలు గెలిస్తేనే యడ్యూరప్ప ప్రభుత్వం కొనసాగడానికి వీలుంది. అందుకే యడ్యూరప్ప అన్ని నియోజకవర్గాలనూ పర్యటించి వీరిని గెలిపిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని పరోక్షంగా మంత్రి పదవుల విషయాన్ని ప్రస్తావించారు.ఇక కాంగ్రెస్ కూడా పెద్ద తప్పిదమే చేసింది. గత ఎన్నికల్లో పట్టున్న నేతలు పోటీ చేయడంతో ఇక్కడ గెలుపు సాధ్యమయింది. అప్పటి వరకూ ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు వారే దిక్కుగా ఉన్నారు. మరో కీలక నేత లేరు. వారి వెంట ముఖ్యనేతలందరూ వెళ్లిపోవడంతో కాంగ్రెస్ కొత్త అభ్యర్థులను నిలబెట్టాల్సి వచ్చింది. అయితే వీరు పెద్దగా ప్రభావం చూపలేరని అంటున్నారు. పార్టీని చూసి ఓటేస్తేనే ఈ నియోజకవర్గాల్లో గెలుపు సాధ్యమవుతుంది. లేకుంటే ఇక అంతే సంగతులు.
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి జాతీయ స్థాయి నేతలు ఎవరూ రాలేదు. కేవలం సిద్ధరామయ్య, దినేష్ గుండూరావు, పరమేశ్వర, వేణుగోపాల్ వంటి నేతలే ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమం మొత్తాన్ని సిద్దరామయ్య దగ్గరుండి చూసుకున్నారు. గెలుపు, ఓటములు ఆయన ఖాతాలోనే పడతాయి. జేడీఎస్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు కొంత టర్న్ అవుతుందన్న ఆశతో కాంగ్రెస్ నేతలున్నారు. మొత్తం మీద ప్రచారం ముగిసిన తర్వాత అన్ని పార్టీల నేతలు పోలింగ్ పైనే దృష్టి పెట్టారు.సంకీర్ణ సర్కార్ కుప్పకూలిపోయిన తొలినాళ్లలో జనతాదళ్ ఎస్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగింది. సంకీర్ణ సర్కార్ కూలిపోవడానికి సిద్ధరామయ్య కారణమంటూ జేడీఎస్ అధినేతలు దేవెగౌడ, కుమారస్వామిలు సయితం ఆరోపించారు. సిద్ధరామయ్య ప్రోద్బలంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్న విమర్శలు చేశారు. సమన్వయ కమిటీ ఛైర్మన్ గా ఉన్న సిద్ధరామయ్య ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలూ విన్పించాయి. అయితే ఉప ఎన్నికలు దగ్గరపడే సమయంలో తిరిగి జేడీఎస్, కాంగ్రెస్ లు ఒక్కటయ్యే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి.ఉప ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది స్థానాలను బీజేపీ దక్కించుకోకపోతే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. అప్పడు కాంగ్రెస్, జేడీఎస్ మరోసారి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసే అవకాశముంది. అయితే ఈసారి కాంగ్రెస్ కు సీఎం పదవి దక్కే అవకాశముంది. ఈ మేరకు జేడీఎస్ కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కుటుంబ పార్టీగా ముద్రపడిన జేడీఎస్ కొంతకాలం ముఖ్యమైన పదవులకు తాము దూరంగా ఉండి పార్టీ నేతలకు ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు. అయితే సిద్ధరామయ్యను కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే జేడీఎస్ సహకరించదు.సిద్ధరామయ్య, దేవెగౌడల మధ్య దీర్ఘకాలంగా శతృత్వం ఉంది. అందుకోసమే దేవెగౌడ, కుమారస్వామి లు డీకే శివకుమార్ పేరును ప్రత్యేకంగా తెరపైకి తెస్తున్నారు. డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తే తమకు అభ్యంతరం లేదని సంకేతాలు కూడా పంపుతున్నారు. డీకే శివకుమార్ కూడా సిద్ధరామయ్య పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. వర్గాలను ప్రోత్సహించడం, తన వర్గం వారికే పదవులు ఇవ్వడం వంటి వాటితోనే కర్ణాటక సంకీర్ణ సర్కార్ కూలిపోయిందని డీకే కూడా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామితో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు రోజు ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సిద్ధరామయ్యకు చెక్ పెట్టే పనిలో కాంగ్రెస్ త సహా, జేడీఎస్ నేతులున్నారు.

Related Posts