సోషల్ మీడియాలో హీరోగా ఎస్పీ
లక్నో, డిసెంబర్ 5,
దేశంలో ఒంటరి మహిళకు రక్షణ.. గాల్లో దీపం వంటిదేనని దిశ ఘటనతో తేటతెల్లమైంది. దిశ కేసులో అరెస్టయిన నిందితులకు మరణ దండన విధిస్తేనే.. ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పడతాయని ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు మహిళల రక్షణకు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పేందుకు ఈ ఘటన స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.ఉత్తరప్రదేశ్‌లో రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్న ఎస్పీ అలోక్ ప్రియదర్శికి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకెళ్తున్న ఓ మహిళా ఉద్యోగి కనిపించింది. దీంతో ఎస్పీ ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఓ హోటల్‌లో పనిచేస్తుందని, పని పూర్తి కావడంతో ఇంటికి తిరిగి వెళ్తున్నానని చెప్పింది. దీంతో ఆయన ఆమెను పోలీస్ వాహనం ఎక్కించుకుని ఆమె పనిచేస్తున్న హోటల్‌కు తీసుకెళ్లాడు. మహిళా ఉద్యోగులను రాత్రి వేళల్లో ఇలా ఒంటరిగా వదలకూడదని, తప్పకుండా వారికి క్యాబ్ సదుపాయం కల్పించాలంటూ హోటల్ యజమానికి చివాట్లు పెట్టారు.దీంతో ఆ హోటల్ యజమాని ఆమె కోసం క్యాబ్ బుక్ చేసి ఇంటికి పంపాడు. ఇకపై నగరంలో హోటళ్లయినా, సంస్థలైనా రాత్రి వేళల్లో డ్యూటీ చేసే మహిళలను ఒంటరిగా కాకుండా క్యాబ్ బుక్ చేసి పంపాలని అలోక్ ఆదేశించారు. లేనట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరించారు. అలోక్ చేసిన పనికి సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. మన పోలీసులు కూడా ఇంత అప్రమత్తంగా ఉంటే దిశ వంటి ఘటనలు చోటుచేసుకొనేవి కాదు కదా!