సింధూరం తొలగించామంతే...
యాదాద్రి ప్రధానపూజారి
నల్గొండ, డిసెంబర్ 5,
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిది ఉగ్ర రూపం కాదని.. ఆయన శాంత మూర్తేనని ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు స్పష్టం చేశారు. సింహానికి కోరలుండడం సహజమైన విషయమేనని తెలిపారు. అంతమాత్రాన స్వామివారు ఉగ్ర రూపంలో ఉన్నట్లు కాదని వివరించారు. మూల విరాట్టుకు ఉగ్రరూపం వచ్చేలా మూల విరాట్టుకు మార్పులు చేశారని వస్తున్న వాదనల నేపథ్యంలో ఆలయ ఉన్నతాధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వాదనలు పూర్తి అబద్ధమని కొట్టి పారేశారు. ఆగమ శాస్త్ర పరంగా ఎలాంటి తప్పూ జరగలేదని స్పష్టం చేశారు. ‘‘మన లక్ష్మీ నరసింహ స్వామివారు.. గొప్ప శక్తిమంతుడు. ఎన్నో యుగాల క్రితమే ఆవిర్భవించారు. కాలం గడుస్తున్న కొద్దీ మార్పులనేవి సహజమైనటువంటి విషయం. మనుషుల విషయంలోనూ మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో.. ఇప్పుడూ అలాగే ఉన్నామా?’’ అని వ్యాఖ్యానించారు.‘‘కుంభాభిషేకం జరిగే ఈ సందర్భంలో మూల విరాట్టుపై ఈ రకమైన వార్తలు రావడం భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లే అవుతుందని భావిస్తున్నాం. ఈ వార్తను పూర్తిగా ఖండిస్తున్నాం. యాదాద్రి ఒక్కటే కాదు. ప్రపంచంలో ఏ నరసింహ స్వామి విగ్రహాన్ని చూసినా, నాలుక బయటికే ఉంటుంది. ఈ కాలపు ఆర్ట్ క్యాలెండర్లు చూడకండి. వాటిలో బొమ్మలు ఎలాగైనా వేసుకోవచ్చు. కావాలంటే వంద తలలు డిజైన్ చేసుకోవచ్చు. శిల్ప శాస్త్ర ప్రకారం నాలుక బయటకు ఉండడం నరసింహస్వామి రూపధర్మంలో ప్రధానం. మూలవిరాట్టును శిల్పులెవరూ తాకనేలేదు. కొన్ని దశాబ్దాలుగా విగ్రహానికి సింధూరం అద్దుతుండడం వల్ల దాదాపు 15 అంగుళాల మేర పెచ్చు కట్టుకుపోయింది. స్వామివారికి ఎప్పటినుంచో వేస్తున్న ఈ సింధూరాన్ని మేం స్వయంగా తొలగించాం.’’ఆలయ విస్తరణ నిర్మాణాల్లో భాగంగా ఒకసారి నేను అసంతృప్తికి గురైన సంగతి నిజమే.. ఎందుకంటే సీఎం కేసీఆర్ బొమ్మలను గోడలపై చెక్కారు. దాంతో మేం బాగా ఫీలయ్యాం.’’ అని లక్ష్మీనరసింహాచార్యులు వివరణ ఇచ్చారు