గాయత్రి గోశాల నిర్వహణ చాలా బాగుంది..
శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి
కర్నూలు డిశంబర్ 05
దిన్నేదేవరపాడు, డోన్ రోడ్ నందు గల గాయత్రి గోశాల నిర్వహణ చాలా బాగుందని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. గురువారం స్వామిజీ డోన్ రోడ్డులోని గాయత్రి గోశాలను సందర్శించారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా పాద పూజల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామిజీ గాయత్రి గోశాలకు వచ్చారు. స్వామిజీ వెంట కర్నూల్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి టిజి భరత్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, గాయత్రి గోసేవ సమితి సభ్యులు ఉన్నారు. గోశాలలో పర్యటించిన స్వామిజీ సప్త గో ప్రదక్షిణ శాలలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం గో తులాభారం చేసి గోవులకు దానపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గాయత్రి గోశాల నిర్వాహకులతో మాట్లాడారు. దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు గోసేవ సమితి సభ్యులు తెలిపారు. ఒకేచోట ఇన్ని గోవులతో గోశాల నిర్వహిస్తుండటం సంతోషించదగ్గ విషయమని స్వామిజీ అన్నారు. తాము కూడా గోశాలను నిర్వహిస్తున్నట్లు స్వామిజీ చెప్పారు. తమ సహకారం మీకు ఎప్పుడు ఉంటుందన్నారు. అనంతరం టిజి భరత్ స్వామిజీకి గోమాత చిత్రపటం అందజేశారు. స్వామిజీ టిజి భరత్ ను శాలువా కప్పి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గోసేవ సమితి అధ్యక్షులు జగదీష్ గుప్త, సెక్రటరీ ఇల్లూరు లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షులు విజయ్ కుమార్, కోశాధికారి రాజ్యలక్ష్మి, టిజి శివరాజ్, గాయత్రి గోసేవ సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.