దటీజ్ సజ్జనార్
హైద్రాబాద్, డిసెంబర్ 6
సజ్జనార్… ఈ పేరు వింటేనే క్రిమినల్స్ నిద్రపోరు. 2008లో వరంగల్ లో గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు అప్పుడు కూడా నిందితులు ఎన్ కౌంటర్ కు గురయ్యారు. అప్పుడు వరంగల్ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అయితే ఈసారి సజ్జనార్ సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా ఉన్నారు. షాద్ నగర్ ప్రాంతంలో దిశ హత్య, అత్యాచారం గత నెల 27వ తేదీన జరిగింది. దిశ హంతకులను ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది నినదించారు. చివరకు పార్లమెంటులో సయితం దిశ హత్య ఘటనపై చర్చ జరిగింది.అయితే దిశ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి కోరారు. చర్లపల్లి జైలులోనే పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. అయితే సీన్ రీకనస్ట్రక్షన్ చేయడం కోసం దిశ హత్య జరిగిన ప్రాంతానికి నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. సంఘటన ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు విచారణ చేస్తున్న సందర్భంగా నిందితులందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు తెల్లవారుజామున 3.30గంటలకు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులను పోలీస్ కస్టడీకి అనుమతించిన మరుసటి రోజునే ఎన్ కౌంటర్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంఘటన స్థలికి చేరుకున్నారు
పోలీసులకు అభినందనలు
పక్కా ప్లాన్ వేసి, దిశపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను సజీవదహనం చేసిన నలుగురు నిందితులూ హతమయ్యారు. ఈ ఉదయం నిద్ర లేవగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినిపించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారు పెద్దఎత్తున ఘటనాస్థలికి వచ్చారు.వందలాది మంది ఆ ప్రాంతంలో చేరి "పోలీసులూ జై", "జస్టిస్ ఫర్ దిశ", "సజ్జన్నార్ జిందాబాద్" అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు, తమ వాహనాలను సైతం బ్రిడ్జ్ వద్ద ఆపి ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను ఇప్పటికే తరలించిన అధికారులు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనిలో పడ్డారు. ప్రజలు మాత్రం ఈ ఎన్ కౌంటర్ పై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడే వారికి ఇటువంటి శిక్షలే పడాలని, అప్పుడే మరొకరు ఇటువంటి దారుణాలకు పాల్పడాలన్న ఆలోచన కూడా చేయబోరని అంటున్నారు.