దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల్ని తెల్లవారు 3న్నర గంటల సమయంలో... తెలంగాణ పోలీసులు ఎన్‍కౌంటర్ చేశారు. నిందితులు తమ దగ్గరున్న తుపాకులు లాక్కొని తమపై దాడి చెయ్యాలని యత్నిస్తూ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తాము ఎన్‌కౌంటర్ చెయ్యాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఐతే... నిందితుల తల్లిదండ్రులు మాత్రం పోలీసులు అబద్ధం చెబుతున్నారనీ, కావాలనే నిందితులు నలుగురినీ చంపేసి, ఎన్‌కౌంటర్ జరిగిందని అబద్ధం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ కొడుకుల్ని అన్యాయంగా చంపేశారని నిందితుడు అరిఫ్ తల్లి, మరో నిందితుడు చెన్నకేశవులు తల్లి కన్నీరు పెడుతున్నారు. నిందితులకు కోర్టులు శిక్షలు విధించాలనిగానీ... ఇలా పోలీసులే అన్యాయంగా చంపేస్తే... ఇక న్యాయం ఎక్కడ అని వారు ప్రశ్నిస్తున్నారు. దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై తమకూ ఆవేదన ఉందనీ, తమ పిల్లల్ని కాపాడాలని తాము కోరట్లేదనీ... ఐతే... శిక్షలనేవి చట్టప్రకారం కోర్టులు వెయ్యాలే తప్ప... ఇలా పోలీసులే ఎన్‌కౌంటర్ పేరుతో చంపేయడం ఎంతవరకూ సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు వాళ్లను చంపేసే ఉద్దేశంతోనే తెల్లవారకముందే స్పాట్‌కి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో నాటకం ఆడారని... సీన్ ఏరియాకి తీసుకెళ్లి... తమ కొడుకుల్ని కాల్చి చంపి... ఎన్‌కౌంటర్ డ్రామా ఆడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోలీసులే చంపేస్తుంటే... ఇక కోర్టులు, చట్టాలూ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరగలేదనీ, తమ కొడుకుల్ని చంపేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితులు ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులు చనిపోయారని తెలిసింది. తెల్లారిన తర్వాత సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కి తీసుకెళ్తే... సెక్యూరిటీ సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే... తాము... తెల్లావారుజామున 3 గంటల సమయంలో నిందితుల్ని తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.