మెట్రోలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్
హైద్రాబాద్, డిసెంబర్ 6,
సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం, బల్దియా కలిసి తీసుకుంటున్న చర్యలు ముందుచూపు లేకుండా చేస్తున్నట్టు కనిపిస్తోంది. మోడ్రన్ టెక్నాలజీ హడావుడే తప్పా భవిష్యత్ దృష్ట్యా ప్రాజెక్టులు చేపడుతున్నట్టుగా లేదు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండో అతి పెద్దది. ఈ మెట్రో ప్రాజెక్టులో భాగంగానే డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లను నిర్మించాలని బల్దియా ప్లాన్ చేస్తోంది.. ఇందులో భాగంగా అక్కడి ‘డబుల్ డెక్కర్’ ఫ్లై ఓవర్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రేటర్‌లో కూడా వీటిని నిర్మించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని చెబుతున్నా, వాస్తవ పరిస్థితిని బట్టి చూస్తే నెరవేరేలా కనిపించడం లేదు.నాగ్పూర్‌లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు నిర్మించారు. రెండు అంతస్తుల్లో నిర్మించే ఈ ఫ్లై ఓవర్‌లో పైన మెట్రోరైలు మార్గం, కింది ఫ్లై ఓవర్‌లో రోడ్డు మార్గం ఉండి రెండు లైన్లు సమ దూరం ప్రయాణిస్తాయి. రోడ్డు ద్వారా ప్రయాణించే వెహికల్స్, అవసరమైన చోట దిగేందుకు ఫ్లై ఓవరు నుంచి డైవర్షన్ రోడ్లను నిర్మించారు. ఇలా నిర్మించడం వల్ల ట్రాఫిక్ సమస్యకు పరిష్కరించడమే కాకుండా తక్కువ స్థలం అవసరమవడమే కాకుండా నిర్మాణ ఖర్చు తగ్గింది.నాగ్పూర్‌లో రూ.8,600కోట్లతో మెట్రో ప్రాజెక్టును చేపట్టారు.38.21 కిలోమీటర్ల మేర మెట్రో, రోడ్డు లైన్‌లో ఒకదానిపై ఒకటి నిర్మించారు. ఇలా ఒకే పిల్లర్లపై నిర్మించడం వల్ల భూమి, ఆస్తులు సేకరణ సులభమైంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 40 శాతం ఆదా అయిందని, ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేశామని అక్కడి మెట్రో అధికారులు చెప్పారు. ఇదే ఫార్ములాను మనసిటీలోనూ వాడుకొని ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఫ్లై ఓవర్ ఏర్పాటు ద్వారా త్వరగా, సురక్షిత మార్గాలను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.మన సిటీలో రూ.18వేల కోట్లతో 72 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రతిపాదించగా, ఇప్పటికే 56 కిలోమీటర్ల దూరం అందుబాటులోకి వచ్చింది. ఈ లైన్లలో డబుల్ డెక్కర్‌ను నిర్మించడం ఇంజనీరింగ్‌పరంగా కష్టసాధ్యం కాగా.. ప్రస్తుతమున్న పిల్లర్లను పూర్తిస్థాయిలో మార్చాల్సి ఉంటుంది. కానీ కొత్తగా నిర్మించే ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ సాధ్యమవుతుంది. కొన్నిచోట్ల కొత్తగా నిర్మించాలనుకున్నా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఫ్లై ఓవర్ నిర్మించే చోట భూమి నాణ్యత, పిల్లర్లు ఏర్పాటు చేస్తే వాటిపై భారం, తట్టుకునే శక్తి అన్ని పరిశీలించాలి. ఉదాహరణకు ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద కొత్తగా ఫ్లైఓవర్ నిర్మించేందుకు ఒక్క శాతం కూడా అవకాశం లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఎంఎంటీఎస్ మీదుగా ఒక ఫ్లై ఓవర్, మెట్రో లైన్, స్టేషన్‌కు సంబంధించిన ఫ్లై ఓవర్ ఇప్పటికే ఉన్నాయి. ఈ సర్కిల్ వద్ద ఒక రోడ్డుకు అడ్డంగా ఫ్లై ఓవర్ నిర్మించడం దాదాపు అసాధ్యమే. ఒక వేళ కొత్తగా చేపట్టాలన్నా పాతవి పూర్తిగా తొలగించాలి. అలా చేసినా నిలుస్తుందన్న గ్యారంటీ లేదని జీహెచ్‌ఎంసీ సీనియర్ ఇంజినీర్ పేర్కొన్నారు.మెట్రో ఫేజ్–2లో భాగంగా మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 15 కిలోమీటర్లు, రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 30 కిలోమీటర్లు, మియాపూర్- గచ్చిబౌలి- – టోలిచౌకీ– లక్డీకాపూల్ వరకు 20 కిలోమీటర్లు, ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి అల్వాల్ వరకు 8 కిలోమీటర్లు, తార్నాక నుంచి ఈసీఐల్‌కు 7 కిలోమీటర్లు మెట్రో పొడిగించే పనులు చేపట్టాల్సి ఉంది. వీటిలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. హెచ్‌ఎంఆర్ ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం ముందుకు ఈ అంశాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం.నాగ్పూర్‌లో డబుల్ డెక్కర్ నిర్మాణాన్నే మోడల్‌గా తీసుకుని మనం తాపత్రయ పడుతున్నాం. కానీ అక్కడ మాత్రం ఫోర్ -డెక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. దేశంలోనే మొదటిసారిగా 5.3 కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఇప్పటికే రూ.535 కోట్లు విడుదల చేసింది. మన వద్ద ప్రస్తుత అవసరాలను తీర్చే దృష్టితోనే బల్దియా ప్రాజెక్టులు చేపడుతుందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం సిటీలో కోటి జనాభా ఉన్నట్టు అంచనా. మరో పదేండ్లలో రెండు కోట్లు దాటొచ్చని యూఎన్‌ఓ అంచనా వేసింది. ఐటీ కారిడార్‌లో మరో మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఆ లెక్కన అందులో పది శాతం అనుకున్నా 30 వేల పర్సనల్ వెహికల్స్ ఆ ఏరియాలో వస్తాయి. అందుకు అవసరమైన ఫ్లై ఓవర్లు, మెట్రో సర్వీసులు ప్రస్తుతమున్న వ్యవస్థలో లేవు. పెరగనున్న జనాభా, అవసరమైన ట్రాన్స్‌పోర్ట్ సేవలను దృష్టిలో ఉంచుకుని అధ్యయనం, శాస్త్రీయ పరిశీలన చేసి ప్రాజెక్టులు చేపడితే భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యలను అధిగమించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.జీహెచ్‌ఎంసీనే ఫైనల్ అథారిటి అనుకుంటే పొరపాటే. పూర్తయిన నిర్మాణాలు పక్కన పెట్టినా కొత్తగా వచ్చే మెట్రో లైన్లలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని బల్దియా పెద్దలు ఎంత చెప్పినా వినిపించుకునేందుకు హెచ్‌ఎంఆర్ సిద్ధంగా లేదు. సిటీలో వాహనదారుల సమస్య తీరడమే గాక, ఖర్చుల పరంగా ఆదా.. ఇతర ప్రయోజనాలు ఉన్నాయంటూ ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా హెచ్‌ఎంఆర్ పెద్దలు సుముఖంగా లేరు. కనీసంప్రతిపాదనలు కూడా చూడడం లేదని బల్దియాలోని కొందరు ఉన్నతాధికారులు వాపోతున్నారు.బల్దియా, ఇంజినీరింగ్ అధికారులు ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రాజెక్టులు చేపడుతున్నారనడానికి ఐటీ కారిడార్‌ను ఉదాహరణగా పేర్కొనవచ్చు. 1998 నవంబర్‌లో సైబర్ టవర్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎల్‌అండ్‌టీ ఇన్ఫోసిటీ, హెచ్‌ఐసీసీ, మైండ్‌స్పేస్ ఐటీపార్క్ వంటివాటితో సిటీ టెక్నాలజీ హబ్‌గా మారిపోయింది. వెహికల్స్ సౌలభ్యం కోసం హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు గతంలోనే ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఆ తర్వాత వాహనాల రద్దీ నేపథ్యంలో బయో డైవర్సిటీ ఖాజాగూడ సిగ్నల్ నుంచి హైటెక్‌సిటీ, ఐకియా వద్ద అండర్‌పాస్, ఫ్లై ఓవర్, అయ్యప్ప సొసైటీ వద్ద అండర్‌పాస్, జేఎన్‌టీయూ నుంచి మలేషియా టౌన్‌షిప్ వరకు ఫ్లైఓవర్లను నిర్మించారు. బయోడైవర్సిటీ వద్ద మరో ఫ్లైఓవర్ నిర్మాణ దశలో ఉంది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా ప్రాజెక్టులు చేపడుతున్నా సుజానా ఫోరం మాల్ నుంచి మలేషియా టౌన్‌షిప్ వరకు నిత్యం ట్రాఫిక్ జామ్ కష్టాలు తప్పడం లేదు. ఇటీవల నిర్మించిన ఖాజాగూడ ఫ్లైఓవర్ రూట్‌లో, ఓఆర్‌ఆర్ వాహనాల రద్దీ ప్రతి రోజూ ప్రాబ్లమ్‌గానే ఉంటుంది. హైటెక్‌సిటీ సర్కిల్ నుంచి నిత్యం లక్షకు తగ్గకుండా సొంత వాహనాలు ప్రయాణిస్తాయని అంచనా. వేగాన్ని అందుబాటులోకి తెచ్చిన మెట్రో రైళ్లు సైతం రాయదుర్గం, హైటెక్‌సిటీ, దుర్గం చెరువు స్టేషన్లలో జనం రద్దీ కనిపిస్తుంది. మరింత పెరిగే అవకాశం ఉంది.హైదరాబాద్ జనాభా సుమారు కోటి. వెహికల్స్ సంఖ్య సుమారు 49 లక్షలు. పాత ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌తో పాటు కొత్తగా మెట్రో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నాగపూర్ తరహాలో డబుల్ డెక్కర్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెట్రో నిర్మాణం పూర్తయిన ఏరియాల్లో వీలు కాదు. కాబట్టి కొత్త రూట్లలో నిర్మించేందుకు ఆలోచనలు చేస్తున్నారు.
=================================