సిటీలో భారంగా ప్రయాణం
హైద్రాబాద్, డిసెంబర్ 6,
భాగ్యనగరంలో బస్సుల చార్జీలను స్టేజీల వారీగా పెంచి ఖజానాను భారీగా నింపేందుకు ఆర్టిసి పక్కా వ్యూహాన్ని రచించింది. ప్రభుత్వం కిలోమీటర్‌కు ఇరవై పైసలు పెంచుతున్నట్లు ప్రకటించినా….గ్రేటర్ ఆర్టిసిలో నెలకొన్న పరిస్థితుల దృష్టా నష్టాలను పూడ్చేందుకు భారీగానే ‘బాదుడు’కు అడుగులు వేసింది. రాష్ట్రంలోనే ఎక్కువగా నష్టాల్లో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టిసిని మళ్లీ గాడిన పెట్టేందుకు స్టేజీలవారీగా భారం మోపారు. అయితే, తక్కువ దూరానికి ఎక్కువ భారం మోపడం నగరవాసులకు ఒకింత ఆగ్రహానికి గురిచేస్తోంది. మొదటి రెండు స్టేజీలకు గతంలో ఐదు రూపాయలు ఉండగా, ప్రస్తుతం దీనిని పది రూపాయలకు పెంచారు. మూడు నుంచి ఐదు స్టేజీల వరకు పది రూపాయలు చార్జీలు ఉండగా, మంగళవారం నుంచి పదిహేను రూపాయలకు పెంచడం విశేషం.ఇలా ప్రతి టిక్కెట్‌పై ఐదేసి రూపాయలు పెంచింది. పెరిగిన చార్జీలతో ఒక్కో బస్సుకు వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అదనంగా ఆదాయం చేకూరుతోందని ఆర్టిసివర్గాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోలలో 3810 బస్సులు ఉండగా, ప్రస్తుతం 2500 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. సమ్మె నేపథ్యంలో 50రోజులకు పైగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో సుమారు 1300బస్సులు మరమ్మతులకు వెళ్లాయి. పెంచిన చార్జీలతో గ్రేటర్ ఆర్టిసికి యేటా అదనంగా రూ.500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.