దిల్లీ: వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్‌లో భార్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ వాదనను సమర్థిస్తూ దీనిపై విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది.
2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి వైకాపా తరపున పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెదేపా అభ్యర్థి వెంకట రమణరాజుపై గెలుపొందారు. అయితే పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వెంకటరమణరాజు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో భార్యను ఓ చోట ఎండీగా, మరోచోట సాధారణ గృహిణిగా పేర్కొన్నారని, ఆదాయ వనరులను సరిగా చూపలేదని నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు వంద పేజీల తీర్పును వెలువరించింది. ఈ కేసును పునర్విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రాతో కూడిన ధర్మాసనం హైకోర్టును ఆదేశించింది