ఎల్లడెలా మద్దతు
న్యూఢిల్లీ, డిసెంబర్ 7
దిశా కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా పలువురు నేతలు, సినీ ప్రముఖులు స్పందించారు. సామాన్యులకు నేర విచారణపై నమ్మకం సన్నగిల్లినందునే ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉన్నావ్ , హైదరాబాద్ ఇలా లైంగిక దాడుల ఘటనల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అందుకే ఎన్‌కౌంటర్‌ను వారు హర్షిస్తున్నారని చెప్పారు. నేరస్తుడు పారిపోతున్న క్రమంలో పోలీసులకు మరో ప్రత్యామ్నాయం ఉండదని హైదరాబాద్ పోలీసుల చర్యను చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ సమర్ధించారు.ఈ ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరిగినట్టేనని అన్నారు. ఇక పోలీసుల చర్యను స్వాగతిస్తామని ఆర్జేడీ నేత రబ్రీ దేవి పేర్కొన్నారు. దిశ లైంగిక దాడి కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ సాహసోపేతమైందని బాబా రాందేవ్ స్వాగతించారు. ఎన్‌కౌంటర్‌పై తలెత్తే న్యాయపరమైన ప్రశ్నలు వేరని, ఈ ఘటనతో మాత్రం దేశ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు లైంగిక దాడి కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ను బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తప్పుపట్టారు. చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోలేరని వ్యాఖ్యానించారు. చట్టానికి అనుగుణంగా విచారణ ప్రక్రియకు ముందే పోలీసులు నిందితులను మట్టుబెడితే ఇక కోర్టులు, చట్టాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు