అక్కడే పంచనామాలు
హైద్రాబాద్, డిసెంబర్ 6,
శాంతి భద్రతల దృష్ట్యా దిశ నిందితుల మృతదేహాలకు ఎన్‌కౌంటర్ చేసిన ప్రదేశంలోనే గాంధీ ఆస్పత్రి వైద్యులు పంచనామా నిర్వహించారు.. స్థానిక ఫరూక్ నగర్ ఎమ్మార్వో, ఆర్డీవోల సమక్షంలో శుక్రవారం పోలీసులు పంచనామా జరిపి, అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ... ‘నాలుగు మృతదేహాలు 20 నుంచి 30 అడుగుల దూరంలో పడి ఉన్నాయి. మృతదేహాలకు పంచనామా నిర్వహించాం’ అని తెలిపారు.కాగా ఘటనా స్థలంలో క్లూస్ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పంచనామా జరిగిన అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం నాలుగు మృతదేహాలను ఫరుక్ నగర్ కుందూర్, నందిగామ, చౌదరిగూడ ఎమ్మార్వోలకు అప్పగించారు. మరోవైపు మృతదేహాలకు మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.మరోవైపు వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.