పేదల ఆరోగ్యానికి కేంద్రం 5 లక్షల వరకు సహాయం
నెల్లూరు డిసెంబర్ 6,
దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాల ద్వారా ఐదు లక్షల వరకు ఆరోగ్య స్వస్థతకు తోడ్పాటును అందిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్వనీకుమార్ చౌబే తెలిపారు. దేశంలోని 10.74 కోట్ల పేద కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని లోక్సభలో శుక్రవారం లిఖితపూర్వకంగా తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దేశంలోని ఆస్పత్రుల, డాక్టర్ల కొరత గురించి శుక్రవారం లోక్ సభలో ప్రశ్నించారు. దేశంలో సగానికిపైగా జనానికి ఏ విధమైన ఆరోగ్య పథకం వర్తించడం లేదని,దీనికి కారణం ఏమిటని ప్రశ్నించారు. నీతి అయోగ్ పేదలు మధ్యతరగతి ప్రజల కోసం ఎలాంటి ఆరోగ్య పథకాన్ని రూపొందించిందని ప్రశ్నించారు. దీనికి అశ్విని కుమార్ చౌబె సమాధానం చెబుతూ ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆసుపత్రుల నిర్మాణం, డాక్టర్ల నియామకం రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని తెలిపారు. అయితే దీనికి కావాల్సిన ఆర్థిక, సాంకేతిక తోడ్పాటు మాత్రం జాతీయ ఆరోగ్య సంఘం( ఎన్ హెచ్ ఎం) చూస్తుందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్లో 2018 మార్చి 31 వరకు 50 పీహెచ్సీల కొరత, 106 సి హెచ్సి ల కొరత ఉందని తెలిపారు ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టరు ఉండాల్సి ఉండగా 1456 మందికి మాత్రమే ఒకరు సేవలు అందిస్తున్నారని తెలిపారు. 2018 మార్చి నాటికి 222 మెడికల్ ఆఫీసర్లు, 149 మంది స్పెషలిస్టులకు పోస్టులు మంజూరు అయ్యాయని తెలిపారు. దేశంలో అవసరానికి సరిపడా డాక్టర్లు లేరని 80 శాతం మంది మాత్రమే ఉన్నారని, అందులో కూడా అందరూ అందుబాటులో లేరని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని వివిధ రకాల ఆసుపత్రుల్లో చాలావరకూ సేవలను ఉచితంగా అందించేందుకు నీతి అయోగ్ కృషి చేస్తోందని పేర్కొన్నారు .దేశంలో 11, 59,309 మంది అల్లోపతి డాక్టర్లు ఉన్నారని, ఇందులో కూడా 9.27 లక్షల మంది డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. వీరితో పాటు ఆయుర్వేద హోమియో డాక్టర్లు 7.88 లక్షల మంది ఉన్నారని తెలిపారు వీరికి తోడు యునాని ఆయుర్వేద డాక్టర్లు 6.30 లక్షల మంది సేవలు అందిస్తున్నారని తెలిపారు.