డిస్పెన్సరీలకు మందులు ఇవ్వండి...
హైద్రాబాద్, డిసెంబర్ 7,
ఈఎస్‌ఐలో మందుల కొరత తీర్చేందుకు మెడిసిన్స్ వెంటనే కొనాలని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణం కోనుగోలు ఆర్డర్ ఇచ్చి నెలరోజుల్లోగా అన్ని డిస్పెన్సరీల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. మందుల కొనుగోలు, జీతాలు, బిల్డింగ్ రెంట్ వాటి చెల్లింపుల్లో ఎందుకు నెలల కొద్ది లేట్ అవుతోందని ప్రశ్నించారు. కార్మికులు, ఉద్యోగులు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఇన్ని రోజులుగా ఏంచేస్తున్నారని.. ప్రతి అంశంలో వివరణలు ఇవ్వాలని వారిపై ఫైర్ అయ్యారు.అయితే మంత్రి తీరుపై కొంత మంది అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకోకుండా కట్టడి చేసిందే ప్రభుత్వమని… మూడు నాలుగు నెలలుగా మందుల కొరత ఉన్నట్లు చెబుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేకుండా తామేం చేయగలమంటున్నారు. ఈఎస్‌ఐలో మందుల కొరత, లక్షలమంది కార్మికులు, రోగుల అవస్థలపై ఈనెల 3వ తేదీన ‘వెలుగు’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పలువురు ఈఎస్‌ఐ అధికారులు, ఇతరులు అరెస్ట్ కావడంతో 9 నెలలుగా మందుల కొనుగోలులో నిలిచిపోయింది. కొత్తగా నియమించిన ఈఎస్ఐ డైరెక్టర్ అహ్మద్ నదీమ్ మందుల కొనుగోలు, రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడటం లేదు. దీంతో ఆయన ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న డా.వెంకటస్వామికి అధికారాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి.గతంలో మందుల కొనుగోళ్లలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో మెమో జారీ చేశారు. ప్రొక్యూర్‌మెంట్ కమిటీ మీటింగ్ నిర్వహించకుండా, రూల్స్ ఉల్లంఘించి మందులు కొనుగోళ్లు చేసినట్లు ఆ మెమోలో అభియోగాలు మోపారు. దీంతో అప్పటి నుంచి జేడీ స్థాయిలో మందుల కొనుగోళ్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలు జారీ చేశారు. అలాంటిది ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికే మళ్లీ అధికారం కట్టబెట్టడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.