సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) మాజీ చీఫ్ డేవిడ్ పెట్రాయియస్ భారతదేశానికి గట్టి మద్దతుగా నిలిచారు. భారతదేశం ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్లు తన కెరీర్ మొత్తంలో ఎన్నడూ వినలేదన్నారు. ఆయన వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు చెంప పెట్టు అని చెప్పవచ్చు. బలూచిస్థాన్‌లో సంక్షోభానికి, ఉగ్రవాదానికి భారతదేశమే కారణమని పాకిస్థాన్ పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
రైసినా డైలాగ్‌లో గురువారం డేవిడ్ మాట్లాడుతూ భారతదేశం ఉగ్రవాదానికి నిధులు సమకూర్చినట్లుగానీ, మద్దతిచ్చినట్లు కానీ తాను ఎన్నడూ వినలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకుల్లో ఒకరు భారతదేశ విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్‌ను ప్రశ్నిస్తూ ఇండియా స్పాన్సర్డ్ టెర్రర్ గురించి చెప్పాలన్నారు. దీనిపై డేవిడ్ జోక్యం చేసుకుని మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
‘‘సీఐఏ డైరెక్టర్‌గా, ఆఫ్ఘనిస్థాన్‌లో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ కమాండర్‌గా, నేను ఎన్నడూ ఇండియన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం (భారత ప్రభుత్వం మద్దతిచ్చిన ఉగ్రవాదం) అనే మాటను వినలేదు’’ అని డేవిడ్ చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ కమాండర్‌గా 2010-2011 మధ్య కాలంలో పని చేశారు. 2011 సెప్టెంబరు 6 నుంచి 2012 నవంబరు 9 వరకు సీఐఏకు నేతృత్వం వహించారు.