స్కూళ్లలో స్పెషల్ క్లాసులు...
నిజామాబాద్, డిసెంబర్ 7,
సర్కార్ పాఠశాలలను బలోపేతం చేసే క్రమంలో విద్యాశాఖలో తీసుకుంటున్న పలు సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారిగా జనార్దన్‌రావు నియమితులైనప్పటి నుంచి పాఠశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నిత్యం పాఠశాలలను తనిఖీ చేయడం, అక్కడ అందుతున్న విద్యా విధానంపై లోతుగా అధ్యయనం చేయడం, కావాల్సిన సదుపాయాలు, మార్పులు చేర్పులు కల్పించడం లాంటి చర్యలతో సర్కార్ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ బలోపేతం అవుతూ వస్తున్నది. ఉపాధ్యాయుల హాజరుపై కూడా డీఈవో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 83శాతంగా హాజరు నమోదవుతున్నది. జిల్లాలో ఉన్నత పాఠశాలలు 290 ఉండగా, ప్రాథమిక పాఠశాలలు 119, ప్రాథమికోన్నత పాఠశాలలు 227 ఉన్నాయి. విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న స్కూళ్ల నుంచి అవసరమున్న చోటికి డిప్యూటేషన్‌పై పంపించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. కొన్ని ప్రైమరీ స్కూళ్లలో మొత్తం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి నలుగురు చొప్పున ఉపాధ్యాయులున్న చోట్ల వారిని అవసరమున్న పాఠశాలలకు వర్క్ అడ్జస్ట్‌మెంట్ కింద పంపుతున్నారు.దాదాపు ఇప్పటికే కొన్ని స్కూళ్లలో ఈ ప్రక్రియ మొదలైంది. 8, 9, 10 తరగతులకు సంబంధించి సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో పెట్టుకొని ఇతర పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను వారి సబ్జెక్టు నేపథ్యాన్ని బట్టి ఆయా పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపుతున్నారు. ఈ విధానం ద్వారా 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల టీచర్లు అందుబాటులో ఉండి వారికి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు దోహదపడుతున్నది. దీనికోసం డీఈవో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల సమాచారాన్ని తెప్పించుకున్నారు. ఏ పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులున్నారు? విద్యార్థుల సంఖ్య ఎంత? ఆ పాఠశాల స్థాయిని బట్టి ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు సరిపోతారా? అనే కోణంలో లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు డీఈవో గుర్తించారు. వీరిని ఆ సమీప, అవసరమైన పాఠశాలలకు పంపిస్తున్నారు