వాళ్లను కాల్చి చంపండి : ఉన్నావ్ కుటుంబసభ్యుల డిమాండ్
లక్నో, డిసెంబర్ 7
రాయబరేలీ కోర్టుకు వెళ్తుండగా ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి నిందితులు నిప్పంటించి సజీవదహనానికి యత్నించగా, ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ రోజే మరో మహిళ మృగాళ్ల దాడికి బలికావడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. నిందితులకు వీలైనంత త్వరగా శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మరణ శిక్షే సరైందని ఆమె సోదరుడు అభిప్రాయపడ్డారు. మా సోదరి ఇక మాతో లేదని, ఈ ఘోరానికి కారణమైన ఐదుగురి నిందితులకు మరణ శిక్ష విధించాలన్నదే నా ఏకైక డిమాండ్... ఆమె చివరి కోరిక కూడా ఇదేనని బాధితురాలి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.నిందితులు నిప్పటించిన తర్వాత 90 శాతం గాయాలతో ఉన్న బాధితురాలిని చికిత్స కోసం తొలుత స్థానిక హాస్పిటల్‌లో చేర్పించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం లక్నో తరలించగా, పరిస్థితి విషమించడంతో న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. దాదాపు రెండు రోజుల గంటల పాటు మృత్యువుతో పోరాడుతూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో బాధితురాలు తుదిశ్వాస విడిచింది. మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ఉన్నావ్‌కు తరలించారు.బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. నా కూతురు చావుకు కారణమైన వారిని పోలీసులు కాల్చి చంపితేనే నాకు నిజమైన ఓదార్పని అన్నారు. గత ఏడాదిగా మమ్మల్ని నిందితులు రోజూ తమను వేధిస్తూనే ఉన్నారని, వారిని ఎదిరించే ధైర్యం గ్రామంలో ఎవరికీ లేదన్నారు. పైగా వారి బెదిరింపులను ప్రజలే వచ్చి మాకు చెబుతున్నారని వాపోయారు. వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, హత్యచేసిన నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎలా శిక్షించారో వీరిని కూడా అలాగే కాల్చి చంపాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యాచారం కేసులో నా కుమార్తెతో పాటు తానూ కోర్టులు చుట్టూ తిరిగాం.. న్యాయ ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతుంది? పోలీసులు ఇలాంటి కేసులలో గడువును నిర్ణయించి చార్జిషీట్లను త్వరగా దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, సమీప బంధువుకు సైతం నిందితుల కుటుంబం నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.గ్రామానికి చెందిన మరో వ్యక్తి మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్ చేయడం వల్ల మహిళలపై ఘోరమైన నేరాలకు పాల్పడుతోన్న వారికి బలమైన సందేశం పంపినట్టు అవుతుందని, మరొకరు తప్పుచేయడానికి భయపడతారని అన్నారు. లేకపోతే నిందితుడు శివమ్ త్రివేది లాంటి వారు నేరాలు చేసి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చి తప్పులు చేస్తూ ఉంటారని ఆయన అన్నారు. హైదరాబాద్ పోలీసులు చేసిన చర్యలను అభినందిస్తున్నామని, ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయిందని అన్నారు. నిద్రలేస్తూనే హైదరాబాద్‌లో జరిగిన ఘటన తెలిసి సంబరాలు చేసుకున్నామని, ఒకవేళ నిందితులు పారిపోయింటే మా చెల్లెల్లు, కుమార్తెలు ఎంత అభద్రతో ఉండేవారో ఊహించుకోవచ్చని అన్నారు. సత్వర న్యాయం జరుగుతుందని నేరస్థులు గ్రహించడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.ఉన్నావ్ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ అసెంబ్లీ వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.బాధితురాలి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ శనివారం పరామర్శించనున్నారు. కుమార్తెను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న బాధితురాలి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని ప్రియాంక ట్వీట్ చేశారు. ఘటన జరిగిన రోజే ట్విట్టర్‌లో యోగి ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ‘కేంద్ర హోం మంత్రి, యూపీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి గురించి అబద్దం చెబుతున్నారు.. రోజూ ఇలాంటి సంఘటనలు చూడటం ఆగ్రహం కలిగిస్తోంది.. బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకుని తప్పుడు ప్రచారం ఆపాలి’ అని ప్రియాంక మండిపడ్డారు.ఉన్నావ్ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధితురాలి మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేశామన్నారు. కేసు త్వరితగతిన విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని, నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.