YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సర్వాధికారి మినిస్ట్రీస్ ట్రస్టు వ్యవస్ధాపకుడి అరెస్టు

సర్వాధికారి మినిస్ట్రీస్ ట్రస్టు వ్యవస్ధాపకుడి అరెస్టు

సర్వాధికారి మినిస్ట్రీస్ ట్రస్టు వ్యవస్ధాపకుడి అరెస్టు
శ్రీకాకుళం, డిశంబరు 7
సర్వాధికారి మినిస్ట్రీస్ వెల్ఫేర్ సొసైటీ ట్రస్టు వ్యవస్ధాపకుడు చల్లా రాజా రావును అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్.అమ్మి రెడ్డి తెలిపారు. శనివారం పోలీసు సూపరింటిండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అమ్మి రెడ్డి మాట్లాడుతూ మోటారు సైకిలు ఖరీదులో 70 శాతం ధర చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ట్రస్టు భరించి మోటారు సైకిళు ఇప్పించడం జరుగుతుందని మోసాలకు పాల్పడ్డారని చెప్పారు. పాతపట్నం మండలం తెంబూరు గ్రామానికి చెందిన రాజా తిరుపతి రావు(36) గత 12 సంవత్సరాలుగా హైదరాబాదులో ఉంటూ చర్చి ఫాదర్ గా వ్యవహరించి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంవత్సరం క్రితం స్వగ్రామం రావడం జరిగిందన్నారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనే పన్నాగంతో టెక్కలి పట్టణం బాలాజి నగర్ లో సర్వాధికారి మినిస్ట్రీస్  వెల్ఫేర్ ట్రస్టు పేరుతో కార్యాలయం తెరిచారన్నారు. వాహన ఖరీదులో 70 శాతం చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ట్రస్టు సమకూర్చి మోటారు వాహనాల కొనుగోళుకు అవకాశం కల్పిస్తామని ప్రజలను నమ్మించారన్నారు. మోటారు సైకిళ్ళు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, వరి నూర్పిడి యంత్రాలు, మొదలగు వాహనాలను ఇస్తామని నమ్మించి సంతబొమ్మాళి, సారవకోట, జలుమూరు, పాతపట్నం, నరసన్నపేట, మెళియాపుట్టి, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో రూ.2,19,74,600 లను ప్రజల నుండి తీసుకున్నారని చెప్పారు. అందులో దాదాపు 2 వందల మందికి తక్కువ రేటుకి వాహనాలు ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ఏజెంట్లను నియమించుకొని ప్రచారం చేసుకున్నారని తెలిపారు. దీనిని నమ్మిన 117 మంది తమకు తక్కువ ధరకు వాహనాలు వస్తాయనే ఆశతో రాజా తిరుపతిరావుకు రూ.83.78 లక్షలు ఇచ్చారని చెప్పారు. కాలం గడుస్తున్న కొద్దీ వారికి ఇవ్వాలల్సిన వాహనాలను ఇవ్వకుండా కాలయాపన చేయడం, రాజా తిరుపతి రావు అందుబాటులో ఉండకపోవడంతో అతని చేతిలో మోసపోయినట్లు గ్రహించిన సంతబొమ్మాళికి చెందిన బాధితుడు సిమ్మా కృష్ణా రావు 2019 నవంబరు 1వ తేదీన పోలీసు స్టేషన్ లో పిర్యాధు చేసారని చెప్పారు. పోలీసు స్టేషన్ లో పిర్యాధు మేరకు దర్యాప్తు చేయగా 2019 డిశంబరు 6వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ముద్దాయిని సర్వాధికారి మినిస్ట్రీస్ వెల్ఫేర్ సొసైటీ ట్రస్టు కార్యాలయంలో అరెస్టు చేయడం జరిగిందన్నారు. అరెస్టు సమయంలో రూ.25.40 లక్షల నగదు, రెండు తులాల బంగారు గొలుసు, రూ.12 లక్షల విలువగల మారుతి ఎక్స్ ఎల్ -6 కారు, లక్ష రూపాయలు విలువగల ఫర్నీచరు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొంటూ పూర్తి ఆధారాలు కలిగి ఉన్న బాధితులకు కోర్టు ద్వారా నగదును అందిస్తామని చెప్పారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే తమ పిర్యాధులను అందజేయవచ్చని కోరారు. కేసు చేధన చేయడంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించిన సంతబొమ్మాళి పోలీసు సిబ్బందికి నగదు అవార్డులను అందించారు. 

Related Posts