త్వరలో తీరనున్న ఉల్లి సమస్య
ఏలూరు డిసెంబర్ 7
ఉల్లి సమస్య త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. అనూహ్యంగా పెరిగిన ధరల భారం నుంచి సామాన్యుడిని కాపాడేందుకు తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. సబ్సిడీతో తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నెల 14,15 తేదీల్లో టర్కీ, ఈజిప్టు నుండి కేంద్రం పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతి చేసుకుంటుంది. మన రాష్ట్రానికి 22,147 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు అవసరం. మనం అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అధిక ధరలకు ఉల్లిని కొనుగోలు చేసి తక్కువ ధరలకు వినియోగదారునికి ఇస్తున్న రాష్ట్రాలలో మనదే మొదటిది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ ధరకు ఉల్లిపాయలు అందజేస్తున్నాం. తెలంగాణలో ఉల్లి కిలో రూ.40-45కి మార్కెటింగ్ శాఖ ద్వారా విక్రయిస్తున్నారు. రోజుకు 200 మెట్రిక్ టన్నులు ఉల్లిని కొనుగోలు చేస్తున్నాం. అక్కడక్కడ కొంత మంది వ్యాపారులు ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెంకటరమణ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాలను సమర్థంగా ప్రజలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం సాగింది. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు, రైతు భరోసా, అమ్మఒడి, విద్యాదీవెన, పింఛన్లు, వాహన మిత్ర, గ్రామ- వార్డు సచివాలయాలు తదితర అంశాలపైనే చర్చంతా సాగింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అధ్యక్షతన డీడీఆర్‌సీ సమావేశం జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. తొలుత గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటికి చూపిన పరిష్కారాలపై చర్చ జరిగింది. జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మీశ ఇళ్ల స్థలాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుర్తించిన అర్హుల వివరాలు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి, సేకరించాల్సిన భూములు, అవసరమైన నిధుల వివరాలను తెలిపారు. దీనిపై రామచంద్రపురం, పిఠాపురం, రాజోలు ఎమ్మెల్యేలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పెండెం దొరబాబు, రాపాక వరప్రసాద్ వారి నియోజకవర్గాల్లో గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు, వినియోగంలోకి రాని పరిస్థితిని వివరించారు.