అమృత్ పై నిర్లక్ష్యం (తూర్పుగోదావరి)
కాకినాడ, డిసెంబర్ 09 ): తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కుల అభివృద్ధి లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకం పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. ప్రధానంగా నిధుల మంజూరులో జాప్యం చోటు చేసుకోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రధానంగా ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు ఇస్తే.. 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులను స్థానిక సంస్థలు సమకూర్చుతాయి. కేంద్రం నుంచి మంజూరైనా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల విషయంలో జాప్యం నెలకొనడంతో పనులు పడకేశాయి.. ఫలితంగా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. అమృత్ పథకానికి సంబంధించి 2016లో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలను ఎంపిక చేశారు. తొలి విడతలో మంజూరైన పనులకు ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ విడతలో మంజూరైన ఇంటింటికీ కొళాయి లక్ష్యం నెరవేరలేదు. ప్రతి వీధిలో పైపులైన్ల నిర్మాణం చేపట్టినా.. కొళాయి కనెక్షన్లు మాత్రం ఇవ్వడం లేదు. రెండో విడతలో మంజూరైన డ్రైనేజీలు, ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణ పనుల్లో సైతం ఆశించిన పురోగతి లేదు. కాకినాడ నగరంలో 85 శాతం, రాజమహేంద్రవరంలో 86 శాతం కొళాయి కనెక్షన్లు మంజూరు చేసినట్లు అధికారులు లెక్కల్లో చూపిస్తున్నారు. కాకినాడలోని సంజీవనగర్, డెయిరీఫారం, దుమ్ములపేట ప్రాంతాల్లో పైపులైన్లు వేశారు. ఇక్కడ కొళాయి కనెక్షన్లు మాత్రం ఇవ్వలేదు. రాజమహేంద్రవరంలోని వాంబే కాలనీ, సింహాచలనగర్, సుబ్బారావునగర్, విద్యుత్తు కాలనీ, బర్మాకాలనీ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ధవళేశ్వరం నుంచి వాంబేకాలనీకి వచ్చే పైపులైనుకు కాలం చెల్లిందని అధికారులు గుర్తించారు. దీనివల్ల తరచూ లీకేజీలు అవుతున్నాయని, దాని స్థానంలో కొత్త లైను నిర్మాణం చేపట్టాలని ఈ ఏడాది జనవరిలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటికి సంబంధించి ఇంతవరకు చర్యలు లేవు. దీంతో వాంబేకాలనీ వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాలకు రోజూ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నా.. అవి ఎంతమాత్రం సరిపోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల నుంచి వస్తున్న మురుగునీరు శుద్ధి కాకుండానే గోదావరి నదితో పాటు కాలువల్లో కలిసిపోతోంది. ప్రజలకు మళ్లీ అక్కడి నుంచే కాలుష్య కారకాలతో కూడిన నీటిని తోడి శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. ఈ కాలుష్యాన్ని నివారించడం కోసం ఫేజ్-2లో వచ్చిన నిధులతో మురుగునీటికి శుద్ధిచేసి నది, కాలువల్లో కలిపేందుకు ఎస్టీపీ ప్లాంటు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రాజమహేంద్రవరంలో అదనంగా 60 ఎమ్మెల్డీలు, కాకినాడలో 55 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి పనులను ప్రారంభించారు. కాకినాడలో 15 శాతం పనులే పూర్తికాగా రాజమహేంద్రవరంలో అసలు ప్రారంభమే కాలేదు. స్థల వివాదం వల్ల శంకుస్థాపనకే పరిమితమైంది. రాజమహేంద్రవరంలో గతంలో నిర్మించిన 30 ఎమ్మెల్డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీ ప్లాంటు కూడా అరకొరగా పని చేస్తోంది. రోజుకు 60 ఎమ్మెల్డీల మురుగునీరు వస్తుండగా 30 ఎమ్మెల్డీలనే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 30 ఎమ్మెల్డీల మురుగు నీరు గోదావరిలో కలిసిపోతోంది. తద్వారా జీవజలాలు కలుషితం అవుతున్నాయి. అమృత పథకం కింద కాకినాడ, రాజమహేద్రవరం నగరాల్లో చేపట్టిన డ్రెయినేజీల నిర్మాణ పనుల్లో సైతం పెద్దగా పురోగతి లేదు. కాకినాడలో 55 కిలోమీటర్ల మేర డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు 27 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రాజమహేంద్రవరంలో మొత్తం 23 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 6.5 కిలోమీటర్ల వరకు మాత్రమే నిర్మాణ పనులు పూర్తయింది. డ్రెయినేజీలు అసంపూర్తిగా ఉండటం వల్ల వర్షాలు కురిస్తే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. కొనసాగించడకుండా నిర్మాణాన్ని మధ్యలో ఆపివేయడం వల్ల మురుగునీరంతా రోడ్లపై పొంగి ప్రవహిస్తోంది. ప్రధానంగా ఏవీ అప్పారావు రోడ్డు, తారకరామనగర్, ఆవ, బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో జనం తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది.