రక్షణ విద్య ఏదీ..? (విజయనగరం)
విజయనగరం, డిసెంబర్ 09 : విద్యార్థి దశలో ఆత్మరక్షణ విద్య ఉంటే ఇలాంటి ఘటనలు బారిన పడకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ఇటీవలి ఘటనతో బాలికలకు ఆత్మరక్షణ విద్య అత్యంత ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. పాఠశాల స్థాయిలో విద్యలో భాగంగా విద్యార్థినులకు తైక్వాండో శిక్షణ ఏటా అందజేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో శిక్షణకు సంబంధించిన ఆదేశాలు వెలువడినప్పటికీ అమలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. కేజీబీవీలు మినహా పాఠశాలల్లో అమలైన దాఖలాలు లేవు. అమలుకు ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మాత్రం బదులిస్తున్నారు. పాఠశాలల్లో బాలికలకు ఆత్మరక్షణ విద్యను 2016లో అమల్లోకి తెచ్చారు. గతంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ద్వారా (ఆర్‌ఎంఎస్‌ఏ) 8, 9 తరగతుల విద్యార్థులకు మాత్రమే తైక్వాండో శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రాథమికోన్నత తరగతులు (6, 7), కళాశాల విద్యార్థులకు వర్తింపజేస్తూ ఉత్తర్వుల్లో పొందుపర్చారు. విస్తరించిన మేరకు జిల్లాలో 30,448 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం. రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ‘న్యూ ఆంధ్రా తైక్వాండో అసోసియేషన్’తో జిల్లాస్థాయిలో అవగాహన ఒప్పందం ద్వారా పాఠశాలల్లో అమలు చేయాలని నవంబరు పదిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ చర్యలు చేపట్టాల్సి ఉన్నా, ఎలాంటి పురోగతి లేదు. యువ వైద్యురాలి ఘటన నేపథ్యంలో బాలికలకు తైక్వాండో శిక్షణ అంశం చర్చనీయాంశంగా మారుతోంది. అధికారులు చెబుతున్న ప్రకారం డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు శిక్షణ ఇవ్వాలి. ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా, కేజీబీవీలు మినహా పాఠశాలల్లో శిక్షణ ఎక్కడా ప్రారంభించలేదు. యూపీ తరగతుల్లో సంఘంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోలేదని తెలుస్తోంది. జిల్లాలో 2016-17 విద్యా సంవత్సరం నుంచి తైక్వాండో శిక్షణ ఇస్తున్నారు. 2016-17లో 276 పాఠశాలల్లో 16,807 మంది బాలికలకు శిక్షణ ఇచ్చారు. 2017-18లో 314 పాఠశాలల్లో 22,162, 2018-19లో 334 పాఠశాలల్లో 24,850 మంది విద్యార్థులకు శిక్షణ అందించారు. 2019-20 విద్యా సంవత్సరానికి సమగ్రశిక్ష అభియాన్ ద్వారా(ఎస్‌ఎస్‌ఏ) 208 పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు చదువుతున్న 4,178 మంది విద్యార్థులున్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా 375 పాఠశాలల్లో 26,270 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. నెలకు పది తరగతులు చొప్పున మూడు నెలల కాలానికి 30 తరగతులు నిర్వహించాలి. మూడు నెలలకు ఒక పాఠశాలకు తొమ్మిది వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. శిక్షణ కొంత వరకు లోపబూయిష్టంగా మారుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో 30 తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహించలేదని ఉపాధ్యాయులు ధ్రువీకరిస్తున్నారు. విద్యాశాఖ దీనిపై చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. కేజీబీవీల్లో బడ్జెట్‌తో ముడిపెడుతూ శిక్షణను నిలిపివేసిన సందర్భాలున్నాయి. గడిచిన విద్యాసంవత్సరంలో బడ్జెట్ లేకపోవడంతో శిక్షణ ఇవ్వలేదు. మళ్లీ ప్రస్తుత విద్యాసంవత్సరంలో పునరుద్ధరించారు.