ఢిల్లీలో హోదా కోసం ఎంపీలు పోరాడుతుంటే క్షేత్రస్థాయిలో యువతను, సామాన్య ప్రజలను కదిలించే దిశగా రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి.
13 జిల్లాల్లోనూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జాతీయ రహదారులను నిర్బంధించాలని ప్రధాన రాజకీయ పక్షాలు నిర్ణయించాయి.
టీడీపీ కూడా శాంతియుతంగా నిరసనలు తెలియజేయనుంది.
ఏపీ మళ్లీ గర్జించనుంది. ప్రత్యేక హోదా కోసం గురువారం రోడ్డెక్కనుంది.
ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఇటీవల వామపక్షాలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరిట నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపు ఇచ్చాయి.
రాష్ట్ర ప్రయోజనాలకోసం నిర్వహించే కార్యక్రమం అయినందున నిరసనకు నైతిక మద్దతును టీడీపీ ప్రకటించింది.
అయితే అధికారంలో ఉన్నందున బంద్, రాస్తారోకోలో పాల్గొనే అవకాశం లేదని పేర్కొంది.
నిరసనలపై టీడీపీ కార్యాచరణ రూపొందించింది.
రోడ్ల పక్కన టెంట్లు వేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీటీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు పిలుపు ఇచ్చారు.
వైసీపీతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆయన ఆదేశించారు.
ఆందోళన ముసుగులో వైసీపీ ఉద్రిక్తతలను రెచ్చగొట్టి, విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కళా వెంకట్రావ్ సూచించారు.