ఆర్టీసీ డోర్ డెలివరీ
విజయవాడ, డిసెంబర్ 9,
ఆర్టీసీ విజయవాడ రీజియన్ త్వరలో కొరియర్ డోర్ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ పార్శిల్ సర్వీసుకు ఆదరణ లభిస్తోంది. ఆర్టీసీ అధికారులు కొన్నాళ్లుగా బల్క్ పార్సిళ్లకే డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీనిని వస్త్ర, కూరగాయల వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీ పార్సిల్ సేవలు ఇప్పటికే వినియోగదారుల ఆదరణ పొందాయి. కోరుకున్న వారికి పార్సిళ్లను నిర్ణీత రుసుంకే డోర్ డెలివరీ చేస్తున్నాం. రీజియన్‌లో కొత్తగా కొరియర్ డోర్ డెలివరీ సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నాం. మారుమూల ప్రాంతాలకు సైతం కొరియర్ వస్తువులు/కవర్లను డెలివరీ చేసేందుకు మాకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇదీ ప్రజల ఆదరణ పొందుతుంది.సరుకు రవాణాలో ఆర్టీసీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దీనివల్ల సత్వరమే సరుకును డెలివరీ చేయగలుగుతోంది. సమయం బాగా కలిసి వస్తోంది. వివిధ చోట్ల నుంచి వచ్చిన పార్సిళ్లను రీజనల్ ఆఫీస్‌లోని పార్సిల్ విభాగానికి చేరుస్తారు. అక్కడ వాటికి నంబరు కేటాయించి నిర్దేశిత ర్యాకుల్లో ఉంచుతారు. వాటిని ఫొటోలు తీసి కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. వినియోగదారుడు తమ పార్సిల్ తీసుకెళ్లడానికి రాగానే స్కాన్ ద్వారా ఆ పార్సిల్ ఎక్కడుందో తెలిసిపోతుంది. దానిని కొద్ది నిమిషాల వ్యవధిలోనే అందజేస్తున్నారు. సరుకు ట్రాకింగ్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడు బుక్ చేసిన సరుకు/పార్సిల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వీలుంటుంది.పార్సిల్ రంగంలో ఆశించిన ఫలితాలు వస్తుండడంతో ఆర్టీసీ విజయవాడ రీజియన్ అధికారులు కొత్తగా కొరియర్ డోర్ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నారు. ఇతర సంస్థల మాదిరిగానే కొరియర్ కవర్లను బుక్ చేస్తారు. డోర్ డెలివరీ చేస్తారు. ఆర్టీసీ సరీ్వసులు పట్టణాలు, నగరాలతో పాటు మారుమూల పల్లెలకు వెళ్తున్నందున కొరియర్ సర్వీసుకు కూడా ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు కొరియర్ డోర్ డెలివరీ సేవలు అందుబాటులో లేవు. గత ఏడాది పార్సిల్ రవాణా ద్వారా ఈ రీజియన్ రూ.12 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది రూ.15 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ సాక్స్), మెడ్‌ప్లస్, అపోలో (మందులు), బ్రిడ్జిస్టోన్ (టైర్లు) వంటి సంస్థలు సరుకులతో పాటు విద్యాశాఖ పుస్తకాల రవాణాకు కూడా ఆర్టీసీనే ఎంచుకున్నాయి. ఈ పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు/సంస్థలకు పంపడానికి రీజియన్‌లో ప్రత్యేకంగా ఒక వ్యాను, రెండు ఆటోలను కేటాయించారు. సరుకు ఎక్కువగా వస్తే డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్టు (డీజీటీ) వాహనాలను కూడా వినియోగిస్తున్నారు.వీటికి నగర పరిధిలో బట్వాడా చేయడానికి 50 కిలోల వరకు రూ.20, ఒక క్వింటాల్‌కు అయితే రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. డిమాండ్ బాగుండడంతో విజయవాడ, మచిలీ పట్నం, గుడివాడల్లో జూలై నుంచి కోరిన వారందరికీ డోర్ డెలివరీని అందుబాటులోకి తెచ్చారు. పార్సిల్ వచ్చిన సమాచారాన్ని వెంటనే సంబంధిత వినియోగదారుడికి ఫోన్‌లో తెలియజేస్తున్నారు. వారు తమకు డోర్ డెలివరీ చేయమని కోరితే నిర్ణీత చార్జి వసూలు చేసి చేరవేస్తున్నారు. సేవలు బాగుండటం, ఇతర సంస్థలకంటే తక్కువ చార్జి, తక్కువ సమయంలోనే బట్వాడా చేస్తుండడం వంటి కారణాలతో ఆర్టీసీలో సరుకు రవాణాకు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు.