సిటీలో భారీగా తగ్గనున్న సర్వీసులు
హైద్రాబాద్, డిసెంబర్ 9,
ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచటంతోపాటు సొంత వాహనాల స్థానంలో జనం వీలైనంత ఎక్కువగా ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించేలా ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నారు. అయితే, దేశంలో కాస్మోపాలిటన్ సిటీగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితి విరుద్ధంగా కని పిస్తోంది. దాదాపు కోటి జనాభా ఉన్న మరే నగరంతో పోల్చినా సిటీ బస్సులు ఇక్కడే తక్కువ. కేవలం ప్రధాన రోడ్లపై మాత్రమే సిటీ బస్సులు నడుస్తుంటాయి. దీంతో అంతర్గత ప్రాంతాల ప్రజలు బస్సు కోసం కొంత దూరం వెళ్లక తప్పని పరిస్థితి. హైదరాబాద్‌లో ఏకంగా వేయి బస్సులను జనవరి 1 నాటికి తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నగరంలో 2,700 బస్సులే ఉండనున్నాయి. పదేళ్ల క్రితం సిటీలో తిరిగిన బస్సుల సంఖ్యకిది సమానం. ఈ పదేళ్లలో హైదరాబాద్ లో 30 లక్షలకుపైగా జనాభా పెరిగింది. అందుకనుగుణంగా బస్సుల సంఖ్య పెరగాల్సి ఉండగా.. ఆర్టీసీ తిరోగమనంలో ఆలోచిస్తోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ రూ.1200 కోట్ల నష్టాలను చవిచూడ నుందని అంచనా. ఇందులో రూ.550 కోట్ల నష్టం హైదరాబాద్ నుంచే ఉంటుందని చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెరిగే కొద్దీ నష్టాలు పెరుగుతాయన్న సూత్రాన్ని అనుసరించి, బస్సుల సంఖ్య తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన రెండు సమావేశాల్లో సిటీ బస్సులతో వస్తున్న నష్టాలపై చర్చ జరిగింది. మధ్యాహ్నం వేళ బస్సు లు ఒకదాని వెంట ఒకటి తిరుగుతున్నాయని, ఒక్కో బస్సులో పది, పదిహేను మందికి మించి ప్రయాణికులుండటం లేదని సీఎం పేర్కొన్నారు. నష్టాల నేపథ్యంలో ఇలా నడపడం ఎందుకని ప్రశ్నించారు. దీంతో అధికారులు ఇక బస్సుల సంఖ్య తగ్గించటమే మేలని నిర్ణయించారు.ప్రస్తుతం కాలం చెల్లిన 600 బస్సులను ఈ ఖాతాలో తగ్గించేస్తారు. 500 మంది వరకు డ్రైవర్ల కొరత ఉంది. దీంతో కొన్ని సర్వీసులు డిపోల కే పరిమితమవుతున్నాయి. ఆ మేరకు సర్వీసులకు కోత పెడతారు. బస్సుల సంఖ్య తగ్గించటం కంటే ఉన్నవాటిని హేతుబద్ధీకరించాలి. మధ్యాహ్నం వేళ చాలా ప్రాంతాలకు రద్దీ తక్కువగా ఉంటున్నందున ఆ సమయాల్లో కొన్ని బస్సులను కొత్త ప్రాంతాలకు తిప్పాలి. ఓఆర్‌ఆర్ వరకు సిటీ విస్త రించినందున ఆ ప్రాంతాన్ని దాటి సమీపంలోని కొత్త ప్రాం తాలకు ఆ బస్సులు నడపాలి. దీంతో ఆదాయం పెరగొచ్చు. ఉదయం, రాత్రి రద్దీ వేళల్లో ఉన్న బస్సులే సరిపోవడంలే దు. బస్సుల సంఖ్య తగ్గిస్తే ఆ సమయాల్లో ఇబ్బంది తప్పదు.: ప్రస్తుతం ఆర్టీసీలో బస్సులు–సిబ్బంది దామాషా 1:6గా ఉంది. వేయి బస్సులు తగ్గిస్తే 6వేల మంది సిబ్బందిని తగ్గించాలి. ఇలా మిగిలే సిబ్బందిని ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్న. పైగా, ఆర్టీసీ మొత్తం వ్యయంలో 58 శాతం సిబ్బంది జీతాల రూపేణా ఖర్చవుతోంది. నష్టాలు తగ్గించేందుకు బస్సుల సంఖ్య తగ్గించినా, సిబ్బంది అలాగే ఉంటారు కదా. వారి జీతాలు తగ్గవన్న విషయం గుర్తించలేదా?. చార్జీలతో ఆదాయం పెరిగింది: ఇటీవల పెంచిన చార్జీలతో నగరంలో ఆర్టీసీకి దాదాపు 25 శాతం మేర ఆదాయం పెరిగింది. బస్సు పాస్‌ల ధరల పెంపుతో, ప్రభుత్వం నుంచి వచ్చే రీయింబర్స్‌మెంట్ మొత్తం కూడా పెరుగుతుంది. ఉన్న బస్సులను రేషనలైజ్ చేస్తే కొంత ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రెండు విషయాలను క్రోడీకరించుకునే కసరత్తు చేస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.