ఏపీకి ఉల్లి సబ్సిడీల భారం రూ. 25 కోట్లపైనే
విజయవాడ, డిసెంబర్ 9
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై కిలో రూ.25కే అందిస్తోంది. ధరల స్థిరీకరణ నిధితో ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్లకు సరఫరా చేస్తోంది. అయితే ఉల్లి ధరలు పెరగడంతో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై ఏపీ మార్కెటింగ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులకు కేవలం రూ.25కే ఉల్లి అందజేస్తున్నామని.. ప్రభుత్వం పెద్దఎత్తున సబ్సడీని భరిస్తోందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. ఆయన ఏమన్నారంటే..ఉల్లి ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో.. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా ఒక్క ఏపీ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు కిలో రూ.25 కే సబ్సిడీపై అందిస్తోంది. ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో కిలో ఉల్లికి రూ. 90 నుంచి 100 రూపాయల వరకూ సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అంత భారాన్ని మోయడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరల స్ధిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వ భరిస్తోంది.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉల్లి ధర బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 150 నుంచి రూ. 200 వరకూ పలుకుతోంది. పొరుగునున్న తెలంగాణలో రైతు బజార్లలోనే అక్కడి ప్రభుత్వం ఉల్లి కిలో రూ.45కు విక్రయిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో రూ. 150 నుంచి రూ.200 వరకూ అమ్ముతున్నారు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే రూ. 25కే కిలో ఉల్లి అందజేస్తున్నాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అధిక వర్షాలు కురవడం.. ఉల్లి పంట ఎక్కువగా పండే మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో కూడా అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతిన్నది. అందువల్లే ధరలు విపరీతంగా పెరిగాయి.రైతు బజార్లలో సబ్సిడీతో ఉల్లి అందజేసేందుకు ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కిలో రూ.25కే ఇవ్వడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.25 కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 35 వేల క్వింటాళ్లను కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేసింది. తద్వారా ప్రభుత్వానికి సబ్సిడీ భారం 16.5 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారమైనప్పటికీ.. వినియోగదారులకు మాత్రం రైతు బజార్లలో రూ.25 కే విక్రయించాలని వైఎస్ జగన్ ఆదేశించారు. అలాగే అక్రమంగా ఉల్లిపాయల నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.ఉల్లి కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కొంత సరఫరా చేసినా.. ప్రజల అవసరాలకు తగ్గట్టు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో షోలాపూర్, అల్వార్, కర్నూలు, తాడేపల్లి గూడెం మార్కెట్ల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నాం. అన్ని రైతు బజార్లలో ఉల్లిపాయలు అందుబాటులో ఉంచాం. వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులతో ముఖ్యమంత్రి కార్యాలయం నిత్యం సమీక్షిస్తోంది.