YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 పాఠాలెవరు చెప్తారు..?  (గుంటూరు)

 పాఠాలెవరు చెప్తారు..?  (గుంటూరు)

 పాఠాలెవరు చెప్తారు..?  (గుంటూరు)
గుంటూరు, డిసెంబర్ 09 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తమ్మీద ఖాళీగా ఉన్న 1199 ఉపాధ్యాయ పోస్టుల్లో 620 స్కూల్‌ అసిస్టెంట్‌(585), భాషా పండితుల(35)వే. పదవీ విరమణలు, పదోన్నతులు, బదిలీవంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడగా మరోవైపు డీఎస్సీ-2018 ప్రకటిత పోస్టులు భర్తీ చేయకపోవడం, వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంవంటి అంశాలు సమస్య తీవ్రతను పెంచుతున్నాయి. కొన్నిచోట్ల ఎస్జీటీ ఉపాధ్యాయులను తాత్కాలికంగా సర్దుబాటు చేసినా పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదు.బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో 6-10 తరగతులకు ఉండాల్సిన 16 మంది ఉపాధ్యాయుల్లో ఆరుగురే ఉన్నారు. గణితం, హిందీ పాఠాలు చెప్పేవారు లేక వారం క్రితం వేరే పాఠశాల నుంచి ఇద్దరు ఎస్జీటీలను తాత్కాలిక బదిలీ చేశారు. మొత్తం 310 మంది విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల మాధ్యమం కలిపి బోధిస్తున్నారు. మాచర్ల మండలం విజయపురిసౌత్‌ ఉన్నత పాఠశాలలో గ్రేడ్‌-2 హెచ్‌ఎంతోపాటు ఆంగ్లం, హిందీ, లెక్కలు, ఫిజికల్‌ సైన్స్‌, సాంఘికశాస్త్రం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వినుకొండ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలోని 19 సెక్షన్లలో 1250 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉన్నా హిందీ, ఆంగ్లం, ఫిజికల్‌ సైన్స్‌ బోధించే ముగ్గుర్ని తాత్కాలిక బదిలీపై వారు కోరుకున్న చోటకు పంపారు. ఇలా ఉపాధ్యాయుల్లేని పరిస్థితులు కేవలం ఈ మూడు పాఠశాలల్లోనే కాదు పల్నాడు అంతటా ఉన్నాయి. పదోన్నతులు కల్పించినా కౌన్సిలింగ్‌ కోరుకున్న ఉపాధ్యాయులు గుంటూరు, తెనాలి ప్రాంతానికి పరిమితమవుతున్నారు. సీనియర్లు ఎక్కువ మంది అక్కడే ఉన్నందున 1:1 నిష్పత్తిలో పిలుస్తుండడంతో అక్కడ ఖాళీలు వచ్చేంత వరకు పదోన్నతులు వాయిదా వేసుకుంటున్నారుగానీ పల్నాడుకు రావడానికి మొగ్గు చూపట్లేదు. దీంతో ఇక్కడ పోస్టులు భర్తీ కావడం లేదు. డీఎస్సీ నియామకాలు ఉన్నప్పుడేగానీ సాధారణ సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. పల్నాడులోని వినుకొండ, వెల్దుర్తి, శావల్యాపురం, రొంపిచర్ల, నూజండ్ల, నకరికల్లు, నరసరావుపేట, మాచర్ల, ఈపూరు, దుర్గి, చిలకలూరిపేట, బొల్లాపల్లి పాఠశాలల్లో భారీగా ఖాళీలున్నాయి. పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది బిట్‌ పేపర్‌ తొలగించారు. రాసేందుకు బుక్‌లెట్‌ ఇస్తారు. సిలబస్‌ సకాలంలో పూర్తి చేయడంతోపాటు కొత్త పరీక్ష విధానం అలవాటు కావడానికి ఉపాధ్యాయుల తోడ్పాటు విద్యార్థులకు ఎంతో అవసరం. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై ఇప్పటికి ఆరు నెలలు దాటినా నేటికీ సరిపడా బోధన సిబ్బంది లేనందున ఆ ప్రభావం పరీక్ష ఫలితాలపై ఉంటుందన్న ఆందోళన వారిలోనే కాకుండా తల్లిదండ్రుల్లోనూ వ్యక్తమవుతోంది.

Related Posts