ప్రణాళిక పక్కా.. (కరీంనగర్)
కరీంనగర్, డిసెంబర్ 09 : గ్రామాల్లోని పేదలు పనుల కోసం పట్టణాలకు వలసపోకుండా నివారించే ధ్యేయంతో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల ప్రణాళికకు కార్యాచరణ మొదలైంది. కూలీలకు పనుల కల్పనతో పాటు గ్రామానికి అవసరమైన పనులను గుర్తించడానికి ఈ సారి గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకొని ఉపాధి పనుల ప్రణాళిక తయారు చేస్తున్నారు. పనులు దాదాపు 70 శాతం వరకు గుర్తించారు. ఏటా జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు జరిగే 15 మండలాల్లోని గ్రామాల్లో ఉపాధి పనులకు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇందులో కూలీల వేతనాలకు 60 శాతం, సామగ్రికి 40 శాతం ఖర్చు చేస్తున్నారు. 2018-19కు గాను 28 లక్షల పనిదినాలు లక్ష్యంగా ఎంచుకొని పనులు నిర్వహిస్తుండగా ఇప్పటివరకు 18.35 లక్షల పనిదినాలు పూర్తిచేశారు. వచ్చే మార్చి 31 వరకు లక్ష్యాన్ని అధిగమించి పనులు చేయనున్నారు. వచ్చే ఏడాదికి ప్రజామోదంతో పనులు చేపట్టడానికి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. గ్రామంలో చేపట్టబోయే పనులను ప్రాధాన్య ప్రకారం ఎంపిక చేయడానికి ఈ దఫా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కోరారు. ప్రజాప్రతినిధులకు వివిధ మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకున్నారు. గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులైన సర్పంచి, ఎంపీటీసీ, మహిళా సంఘ సభ్యులు, కార్యదర్శులు మేట్లు, క్షేత్ర సహాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు వారివారి గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, సలహాల మేరకు పనుల ప్రతిపాదనలకు రూపకల్పన చేస్తున్నారు. గ్రామంలో చేపట్టాల్సిన పనులు, గ్రామంలో కూలీలకు అనుగుణంగా పనులు కల్పించాల్సిన పని దినాలను లెక్కించి పనుల ప్రతిపాదనలు తయారు చేసి వాటిని గ్రామసభ ఆమోదించి పాలకమండలి సభ్యుల ఆమోదంతో పనులను అంతర్జాలంలో నమోదు చేయనున్నారు. గ్రామానికి అవసరమైన పనులు డంపింగ్ యార్డు, నర్సరీలు, పశువుల పాకలు, మేకల పాకలు, నీళ్ల తొట్టెలు, రైతుల చేలల్లో ముళ్ల పొదల తొలగింపు, అంతిమధామాలు, సీసీ రహదారులు, మట్టి రోడ్లు, టేకు చెట్ల పెంపకం, బీడు భూముల సాగుకు అనుకూలంగా చేయడం, నీటి నిల్వ గుంతలు, రైతు చేలల్లో ఫాంపాండ్, కూరగాయల సాగు, పూల తోటల సాగు వంటి పనులన్నీ ఉపాధి హామీ పనుల్లో గుర్తించి పనులను కూలీలతో చేసి వారికి వంద రోజులు పని కల్పించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 6,639 శ్రమశక్తి సంఘాలు పని చేస్తుండగా.. జాబ్ కార్డుల సంఖ్య 1.50 లక్షలు ఉన్నాయి. కూలీలు 3.50 లక్షలు నమోదై ఉండగా, అందులో పని చేస్తున్న కూలీలు 90 వేలు ఉన్నారు.