ఉపాధి పనుల బాధ్యత పంచాయితీలకే
మెదక్, డిసెంబర్ 10
మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం 2020 -21లో గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల గుర్తింపు ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని మెజార్టీ గ్రామాల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు గ్రామసభలు నిర్వహించి చేయాల్సిన పనుల లిస్ట్ రెడీ చేశారు. గ్రామాల్లో భూమి లేని నిరుపేదలతోపాటు సన్నకారు రైతులకు ఉపాధి కల్పించేందుకు 200 రోజుల పనికి ప్లాన్లు వేశారు. సాధారణంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయే పనులను ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మూడు, నాలుగు నెలల ముందే గుర్తిస్తారు. 2019 -20లో 7,39,700 పనులను గుర్తించగా ఇప్పటి వరకు 3,00,757 పనులు చేపట్టారు. మిగిలినవి ఏడాది మార్చి చివరి నాటికి చేయాల్సి ఉంది. అలాగే 2020-2021 ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో చేయాల్సిన పనులను గత రెండు నెలలుగా గుర్తిస్తున్నారు. ఈ పనుల సంఖ్య సుమారు 8 లక్షలు దాటే అవకాశముందని ఉపాధి పథకం ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పనుల కోసం రూపొందించే బడ్జెట్ ప్రతిపాదనల్లో 60 శాతం కూలీల వేతనాలకు, 40 శాతం మెటీరియల్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చింది.స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులను ఎంపిక చేస్తున్నారు. ఇలా 30 రకాల పనులను చేపట్టే అవకాశముంది. పనుల్లో వ్యక్తిగత ఆస్తుల పనులు, సామూహిక అవసరాలకు ఉపయోగపడే పనులు అని రెండు రకాలు ఉన్నాయి. గతంలో పనులను ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఎంలు గుర్తించేవారు. ఈ సారి మాత్రం సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది కలిసి ఎంపిక చేస్తున్నారు.రాష్ట్రంలో మొత్తం 55,34,966 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉన్నాయి. కిందటేడాది 2,10,983 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని కల్పించగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,15,644 కూలీలకు కల్పించారు. అంటే వంద రోజుల పని పొందినవాళ్లు నాలుగు శాతం కూడా మించలేదంటే చట్టం అమలుతీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.