సర్కార్ బడి దగ్గరకే.. అంగన్ వాడీ సెంటర్లు
రేషనలైజేషన్ తో మూతపడనున్న 2 వేల కేంద్రాలు
వరంగల్, డిసెంబర్ 10,
తెలంగాణ వ్యాప్తంగా రెండువేల వరకు అంగన్‌వాడీ సెంటర్ల మూసేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఫోన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య తగ్గించేందుకు చెప్పిన (పిల్లల సంఖ్య తక్కువుందంటూ) కారణాన్నే ఇక్కడా చూపుతున్నారు. పది మంది చిన్నారుల కంటే తక్కువ ఉన్న అంగన్వాడీ సెంటర్ల లెక్కలు తీస్తున్నారు. దాదాపు రెండువేల వరకు ఉన్న ఇలాంటి వాటిని సమీప అంగన్వాడీ సెంటర్లలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నారు.రాష్ట్రంలో 99 రూరల్, 25 అర్బన్, 25 ట్రైబల్ ఐసీడీఎస్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ సెంటర్లు కాగా, 3989 మినీ అంగన్వాడీ సెంటర్లు. 30 వేల 517 మంది అంగన్వాడీ టీచర్లు, 28 వేల744 మంది ఆయాలు, 3,296 మంది మినీ అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. మెయిన్ అంగన్వాడీ సెంటర్లలో టీచర్, ఆయా ఉంటే, మినీ సెంటర్లను కేవలం టీచర్లతోనే నడిపిస్తున్నారు. కొద్దిరోజులుగా ఫీల్డ్లెవల్లో జరుగుతున్న సర్వే ద్వారా 1,749 సెంటర్లలో10 మందిలోపు చిన్నారులు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వీటన్నింటినీ సమీప అంగన్వాడీ కేంద్రాల్లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఊళ్లకు అనుబంధంగా ఉన్న తండాలు, పల్లెల్లో మహిళలు, చిన్నారులను దృష్టిలో పెట్టుకొని మినీ అంగన్వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయగా.. వీటిలో కూడా పిల్లల సంఖ్య తక్కువగానే ఉంది. రేషనలైజేష్ ప్రక్రియను ఈ సెంటర్లలో కూడా అమలు చేస్తారా? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే సుమారు 2వేల సెంటర్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఒక ఊరిలో ఒకటి కంటే ఎక్కువ కేంద్రాలు ఉండి, వాటిలో ఏదైనా కేంద్రంలో 10 మంది చిన్నారుల కంటే తక్కువగా ఉంటే దానిని మాత్రమే విలీనం చేస్తామని, ఒక ఊరి నుంచి మరో ఊరికి తరలించే ప్రసక్తే లేదని అఫీషియల్స్ చెబుతున్నారు. కాగా, ఒక ఊరిలో ఎన్ని కేంద్రాలు ఉన్నా అన్నింటినీ ఏకం చేసి, దానిని సమీప సర్కారు బడికి తరలించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.అంగన్వాడీ సెంటర్ పరిధిలోని గర్భిణులకు పౌష్టికాహార లోపం తలెత్తకుండా చూడడం, ఇందుకోసం సరైన ఆహారం అందించడం, తల్లీబిడ్డల సంరక్షణ కోసం సమయానికి టీకాలు ఇప్పించడం, చిన్నారులకు బాలామృతం సరఫరా చేయడం, మూడేండ్ల పిల్లలకు సరైన పౌష్టికాహారంతో పాటు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందజేయడం, పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం అంగన్వాడీ కేంద్రాల ప్రధాన ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులు భరించినా నిర్వహణ బాధ్యత రాష్ట్ర సర్కారుదే. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఐసీడీఎస్ లక్ష్యాలు ముందుకు సాగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొంతకాలంగా అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల పంపిణీ కాక గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు. నిబంధనల ప్రకారం గర్భిణులు, బాలింతలకు రోజూ ఒక గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలతో పాటు మధ్యాహ్నం కూరగాయలు, పప్పుతో కూడిన భోజనం అందించాలి. అంగన్వాడీ సెంటర్లలో చదివే మూడు నుంచి ఆరేండ్ల లోపు వయసుగల పిల్లలకు రోజూ ఉదయం మురుకులు, మధ్యాహ్నం ఒక గుడ్డుతో పాటు పప్పు, ఆకు కూరలతో కూడిన భోజనం పెట్టాలి. సాయంత్రం తిరిగి స్నాక్స్ అందజేయాలి. కానీ మెజారిటీ సెంటర్లకు మూడు నెలల నుంచి పాల సరఫరా నిలిచిపోగా, పదిరోజుల నుంచే తిరిగి సప్లై చేస్తున్నారు. సర్కారు నుంచి సకాలంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు రెగ్యులర్గా గుడ్లు సరఫరా చేయడం లేదు. దీంతో ఒక్కో నెలలో ఆయా అంగన్వాడీ సెంటర్ల పరిధిలో కోడి గుడ్ల పంపిణీ ఆగిపోతోంది. కేవలం బియ్యం తప్ప గడిచిన రెండు నెలలుగా కేంద్రాలకు కంది పప్పు సరఫరా చేయడం లేదు. తీవ్ర విమర్శల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం కొన్ని జిల్లాల్లో అరకొరగా వాటిని అందించారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుత అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం తప్ప ఏదీ సక్రమంగా అందడం లేదు. ఆ ప్యాకెట్లలోని పోషకాహారం చాలావరకు పాడి బర్రెలు, ఆవులకు దాణాగా మాత్రమే ఉపయోగపడుతోంది.‘అందుబాటులో అంగన్వాడీ కేంద్రం’ ఉండాలనేది ఐసీడీఎస్ అసలు నినాదం. సెంటర్ దగ్గరగా ఉంటే గర్భిణులు, బాలింతలు స్వయంగా వచ్చి సరుకులు తీసుకునేందుకు, పరీక్షలు చేయించుకునేందుకు వీలవుతుందని, నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపడం వల్ల వారిని ప్రైమరీ ఎడ్యూకేషన్కు సిద్ధం చేయవచ్చన్నది అప్పటి పాలకుల ఆలోచనగా ఉండేది. కానీ రాష్ట్ర సర్కారు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా రేషనలైజేషన్ తలపెట్టినట్లు తెలుస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తే పేద మహిళలకు, పిల్లలకు సేవలు దూరమవుతాయని, ఫలితంగా అసలు లక్ష్యం దెబ్బతింటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.