మేడారం పనులు షురూ...
వరంగల్, డిసెంబర్ 10,
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం 4వేల బస్సులను నడపనుంది. 2020 ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న మేడారం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది.ఈ జాతరకు తెలంగాణలోని 51 డిపోలకు చెందిన 4 వేల బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్ తెలిపారు.ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆర్టీసీ బస్సుల క్యూ లైన్ల పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అధికారులు మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. ఈ జాతరకు 22 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో జాతరకు 12,500 మంది సిబ్బందిని నియమించనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి మేడారం జాతరకు నిరంతరాయంగా బస్సు సర్వీసులను నడిపిస్తామని వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులను సైతం నడిపిస్తామని..వాటి కోసం ఆన్‌లైన్ రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుందని తెలిపారు. కాగా..సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం రూ. 2కోట్ల 48 లక్షలతో అభివృద్ధి పనులను ఈడీ, ఆర్‌ఎం ప్రారంభించారు