మార్కెట్ కమిటీల ద్వారా ఉల్లి విక్రయాలు
చిత్తూరు, డిసెంబర్ 10
ప్రజలందరూ నిత్యావసర వస్తువుగా వాడుతున్న ఉల్లిపాయల ధర ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలను కిలో 25 రూపాయల సబ్సిడీ ధరకు ప్రజలకు అందించడం జరుగుతున్నదని మార్కెటింగ్ శాఖ ఏడి గోపి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చిత్తూరు రైతుబజార్ల ద్వారా ఇప్పటికి 175 టన్నుల ఉల్లిపాయలను వినియోగదారులకు మార్కెట్ కమిటీల తరఫున పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మొదట్లో ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ప్రజలకు విక్రయించడం జరిగేదని, కాని దీని వలన కిలోమీటర్ల కొద్దీ రద్దీ పెరిగిపోవడంతో ప్రతి వ్యక్తికి కిలో ఉల్లిపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లా తమిళనాడుకు రాష్ట్రానికి సమీపంగా ఉండడంతో అక్కడి ప్రజలు చిత్తూరుకు వచ్చి ఉల్లిపాయలను కొనుగోలు చేసుకుని వెళుతున్నారని తెలిపారు. గతంలో చిత్తూరు రైతు బజార్లో సబ్సిడీ కింద ఉల్లిపాయలను విక్రయించడం జరిగిందని, క్రమంగా వినియోగదారుల రద్దీ పెరగడంతో క్యూ లైన్ రోడ్డు వరకు పెరగడం జరిగిందని, ట్రాఫిక్ కు అంతరాయం జరుగుతుందని మరియు వినియోగదారుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీకి మార్చి పోలీసులు బందోబస్తు మధ్య విక్రయించడం జరుగుతోందని వారు తెలిపారు.