ఉల్లిపాయల ధరల అంశాన్ని రాజకీయం చేస్తున్నారు
కిలో రూ.25లకే దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఇస్తున్నాం
ప్రతిపక్షం శవాలమీద రాజకీయాలు చేస్తోంది
శాసనసభలో ముఖ్యమంత్రి వైయస్.జగన్
అమరావతి డిసెంబర్ 10
ఉల్లిపాయాలకు సంబంధించి రాజకీయాలు చూస్తే బాధేస్తోంది. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తక్కువ రేటుకే ఇస్తున్నాం. ఈ విషయంలో దేశంలోనే నంబర్ ఒన్ రాష్ట్రంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన శాసనసభలో మాట్లాడారు. బీహార్లో కిలో రూ.35, బెంగాల్ రూ. 59 అయితే, తెలంగాణ రూ.40 అయితే, తమిళనాడులో రూ.30–40లు అయితే మధ్యప్రదేశ్లో రూ.50లు అయితే మన రాష్ట్రంలో అక్షరాల రూ.25 లకే ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో జరుగుతోంది. పంపిణీచేసిన మొత్తాన్నికూడా చూస్తే... తెలంగాణలో ఒకే ఒక్క రైతు బజార్లో అమ్ముతున్నారు. ఆదివారం నాటికి 25 టన్నులు ఇచ్చారు. తమిళనాడులో 50 టన్నుల కన్నా తక్కువ మొత్తంలోనే సబ్సిడీ ఉల్లి ఇచ్చారు. వెస్ట్బెంగాల్లో ఈరోజునుంచి ప్రారంభిస్తామని చెప్తున్నారు.
మహారాష్ట్రలో ఇంతవరకూ ఇవ్వలేదంటని అన్నారు. బిహార్లో నవంబర్ 22 నుంచి నవంబర్ 28వరకూ జరిగిందంట. మన రాష్ట్రంలో అక్షరాల 38,496 క్వింటాళ్లు.. ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఇస్తున్నాం. ప్రభుత్వం జోక్యంచేసుకుని ఈస్థాయిలో ప్రజలకు తోడుగా ఉంటోంది. ఎలాంటి ఇబ్బంది ప్రజలకు జరక్కూడదని ఈ స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు.
సెప్టెంబరు 27, 2019న ప్రభుత్వం మార్కెట్లో జోక్యంచేసుకుని కిలో రూ.25లకే ప్రజలకు అందిస్తున్నాం. పలు దఫాలుగా జోక్యంచేసుకుంటూ తక్కువ ధరకే ఉల్లిపాయలను అందిస్తున్నామని అన్నారు. రైతుబజార్లలో ఇవాళ ఇంత క్యూలు ఉన్నాయంటే దానికి కారణం హెరిటేజ్ షాపుల్లో రూ.200లకు అమ్ముతుంటే, రైతుబజార్లలో రూ.25లకే కిలో ఉల్లిపాయలు అందిస్తున్నాం.
తక్కువ ధరకే, చౌకగా ఉల్లిపాయలు అందిస్తున్నందునే రైతు బజార్లలో క్యూలు అధికంగా ఉన్నాయి. ఈవిషయాలేవీకూడా చంద్రబాబుకి అర్థం కావడంలేదు. అయినా సరే శవాలమీద చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.
ఈ స్థాయిలో దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఉల్లిపాయలను తక్కువ ధరకు అందిస్తున్నా దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు.
38,496 క్వింటాళ్ల ఉల్లిపాయలను తక్కువ ధరకు పంపిణీచేయడమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయలను దిగుమతి చేస్తుంటే అందులో 2,100 మెట్రిక్ టన్నులను మన రాష్ట్ర ప్రభుత్వమే ఇండెంట్ పెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఇదే ఎక్కువ. ఆ సరుకు డిసెంబర్ 12,13 తేదీల్లో ముంబైకి రాబోతోంది. ప్రజలకు మంచి చేసే సమయంలో ఎలాంటి జాప్యం, లోపం చూపించాల్సిన అవసరంలేదని, కాస్త అగ్రెసివ్గానే ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించానని అయన అన్నారు. శుక్రవారం నుంచి రైతుబజార్లలోనే కాదు మార్కెట్యార్డుల్లో కూడా సబ్సిడీపై ఉల్లిపాయలు అందించాలని అధికారులను ఆదేశించాను. దేశంలో మరెక్కడా కూడా ఈ స్థాయిలో ప్రభుత్వం జోక్యంచేసుకోలేదు. ప్రతిపక్షం చేస్తున్నది ధర్మమేనా అని, వాళ్లు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని అయన అన్నారు.