సిటీజన్ షిప్ బిల్లుపై శివసేన యూ టర్న్
ముంబై, డిసెంబర్ 10,
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఏడు గంటలపాటు సాగిన చర్చల అనంతరం సోమవారం అర్ధరాత్రి ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన దాడులకు గురై భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులను ఆదుకునేందుకే ఈ బిల్లుకు రూపకల్పన చేశామని అమిత్ షా స్పష్టం చేశారు.ఈ బిల్లు పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగ నిబంధలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లును భారత రాజ్యాంగంపై దాడిగా అభివర్ణిస్తూ.. రాహుల్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును సమర్థిస్తున్న వారు భారత మూలాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.లోక్ సభలో ఈ బిల్లుకు శివసేన మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన.. బీజేపీ సర్కారుకు సపోర్ట్ చేయడం గమనార్హం. కాకపోతే.. కొత్తగా పౌరసత్వం ఇచ్చిన వారికి 25 ఏళ్ల వరకు ఓటు వేసే హక్కు ఇవ్వొద్దని డిమాండ్ చేసింది. ఈ బిల్లు విషయమై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే స్పందిస్తూ.. పూర్తి స్పష్టత వచ్చే వరకు, అనుమానాలను నివృత్తి చేసేంత వరకు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వమని చెప్పడం గమనార్హం. తమ డిమాండ్లకు ఓకే చెబితేనే బిల్లుకు మద్దతిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.అంతేకాదు లోక్ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశాం కానీ.. బుధవారం రాజ్యసభలో మాత్రం వ్యతిరేకంగా ఓటేస్తామని శివసేన నేత సంజయ్ రౌత్ సంకేతాలిచ్చారు. అంటే ఒకే బిల్లుపై ఒకే పార్టీ ఉభయ సభల్లో రెండు రకాలుగా స్పందిస్తుందన్నమాట.