అయ్యప్ప మాల వేసుకున్నందుకు... స్టూడెంట్ సస్పెండ్
మెదక్, డిసెంబర్ 10,
ఓ విద్యార్థి అయ్యప్ప మాల వేసుకొని తరగతికి హాజరయ్యాడని, పాఠశాల యాజమాన్యం అతణ్ని సస్పెండ్ చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని డాన్ బాస్కో ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రసాద్ అనే బాలుడు ఈ స్కూలులో 5వ తరగతి చదువుతున్నాడు. రెండ్రోజుల ముందు అయ్యప్ప మాల ధరించిన ప్రసాద్ ఎప్పటిలాగే తరగతికి వచ్చి కూర్చోవడంతో, అభ్యంతరం వ్యక్తం చేసిన స్కూలు యాజమాన్యం.. దీక్ష ముగిసే వరకు స్కూలుకు రావొద్దని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని బాలుడికి హెడ్ మాస్టరే చెప్పడం విశేషం.బాలుడ్ని స్కూలు నుంచి వెళ్లగొట్టిన విషయం స్థానికంగా ఉన్న అయ్యప్ప దీక్ష చేపట్టిన వారికి తెలిసింది. విషయం తెలిసిన వారు వెంటనే స్కూలు ముందు ధర్నాకు దిగారు. పాఠశాల ఆవరణలో బైఠాయించి, ప్రసాద్‌ను తక్షణమే తరగతి గదిలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే, పాఠశాల యాజమాన్యం ఇంకా స్పందించలేదు.మరోవైపు, ఇటీవల భువనగిరిలోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ విద్యార్థి అయ్యప్ప మాల ధరించినందు వల్ల స్థానిక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అతని పట్ల కఠినంగా వ్యవహరించింది. పాఠశాల ఆదేశాల మేరకు అతను చాలా రోజులుగా స్కూలుకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. విషయం తెలిసిన అయ్యప్ప స్వాములు పాఠశాల ముందు నిరసన చేపట్టి, హెడ్‌మాస్టర్ ఛాంబర్‌లో వస్తువులను ధ్వంసం చేశారు.ః