YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

 హనుమద్వ్రతం 

 హనుమద్వ్రతం 

 హనుమద్వ్రతం 
శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కథ చెప్పాడు. 
వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తిశ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరు భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఒకటి ఉందని చెప్పి, దాన్ని వివరించాడు. అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు.       అదే శ్రీ హనుమద్ వ్రతం.      దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు.     పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి, దగ్గర వుండి వ్రతం చేయించాడనీ, దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు.      అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి వున్న హనుమత్ తోరణాన్ని చూసి, దాని వివరం అడిగాడు. ఆమె అన్నీ వివరంగా చెప్పగా, అతడికి గర్వం కలగటంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడించాడు. తన జెండాపై కట్టబడ్డ వాడూ, ఒక వానరుడూ అయిన హనుమకు వ్రతం చేయటమేమిటని దుర్భాషలాడాడు.       ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీ కృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు.       అప్పటినుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయనీ ఈ అరణ్య, అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. పదమూడు ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయటం వల్లే పదమూడు ఏళ్ళ అరణ్య, అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా? అని అడిగాడు.      దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కధ చెప్పాడు. పూర్వం శ్రీ రాముడు సీతను వెదుకుతూ, తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతం చేరాడు. సుగ్రీవ, హనుమలతో సఖ్యం చేశాడు.  అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ, దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు.  బ్రహ్మాదిదేవతలు హనుమతో ''హనుమా ! నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తీశ్రద్ధలతోపూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు'' అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి,      "నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు. త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు" అని విన్నవించాడు హనుమ.       అప్పుడు ఆకాశవాణి ''హనుమ చెప్పినదంతా సత్యమైనదే'' అని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాగా, మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు.  పంపా నదీతీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. పదమూడు ముళ్ళ తోరంను పూజించి కట్టుకొన్నాడు.  కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు, భార్య, సోదరులతో వ్రతాన్ని విధివిధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకొన్నారు. 
విశేషం 
జ్ఞాన స్వరూపుడుగా శివుడూ - సర్వవ్యాపకుడుగా విష్ణువూ పరస్పర ఆరాధకులు తారక మంత్రం  కాశీలో విశ్వనాథుడు రామ మంత్రం జపిస్తూ, మరణించినవారి కుడి చెవిలో తారక మంత్రం చెప్పి మోక్షాన్నిప్పిస్తాడు. కాశీలో మరణించినవారి కుడి చెవి కొంచెం ప్రక్కకి తిరిగి ఉండడమే దీనికి నిదర్శనం. శివుని వీర్యంతో జన్మించిన ఆంజనేయుడు రామదాసుగా నారాయణోపాసన చేస్తాడు. అంతా రామమయం విష్ణువుగా అంతటా వ్యాపించియున్నవాడూ - నీరే ఇల్లుగా గలిగినవాడుగా నారాయణుడూ, మన మధ్యలో ఒక మానవ రూపంలో ఉన్న పరమాత్మ శ్రీరాముడు. మానవుడుగా శ్రీరాముడు ఆరాధించిన శివుడు రామేశ్వరుడుగా కనిపిస్తాడు. భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినట్లుగా, శ్రీరాముడు హనుమద్వ్రతం చేశాడని తెలుస్తుంది.
 

Related Posts