భారీగా దసలి పట్టు దిగుబడి
అదిలాబాద్, డిసెంబర్ 11,
మంచిర్యాల జిల్లాలో దసలి పట్టు సాగు తెలంగాణకే తలమాణికంగా మారింది. రాష్ట్రంలోనే దసలి పట్టు కాయ దిగుబడికి మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టు పరిశ్రమ పెట్టింది పేరు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా దసలి పట్టుసాగుకు కొంత నష్టం వాటిల్లినప్పటికి ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యానికి చేరువులో దిగుబడి వస్తుందని అధికారులు అంటున్నారు. చెన్నూర్ పట్టు కేంద్రానికి వివిధ అటవీ ప్రాంతాల నుంచి దసలి పట్టు కాయలను రైతులు తీసుకొస్తున్నారు. రాష్ట్రంలోని భద్రాచలం, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రైతులు దసలి పట్టు సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా రైతులు దసలి పట్టు కాయ సాగు చేస్తూ సాగులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ ప్రాంతంలో పండించిన పట్టు కాయ కొనుగోలు వేలంలో ఇతర రాష్ట్రాల వ్యాపారులు పాల్గొనుండడం విశేషం. ఇక్కడి పట్టు కాయకు మంచి డిమాండ్ ఉందని పలువురు పేర్కొంటున్నారు.చెన్నూర్ పట్టు పరిశ్రమ పరిధిలోని చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, నెన్నల మండలాల్లో పండించిన దసలి పట్టు కాయను చెన్నూర్‌లో బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో చత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పాల్గొంటారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పోవడంతో దిగుబడి కొంత త గ్గిందని రైతులు పేర్కొంటున్నా రు. ఎకరం విస్తీర్ణంలో గల మద్ది చెట్లకు 20 వేల దసలి కాయల దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది 15 నుంచి 18 వేల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుపేద రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం దసలి కాయ సాగును ప్రొత్సహిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో భూమి లేని రైతులను గుర్తించి దసలి కాయను పండించే విధానంపై శిక్షణనిచి్చంది. గత 30 ఏళ్లుగా ఈ జిల్లాల్లో సుమారు 1000 మంది రైతులు 7500 ఎకరాల్లో దసలి పంటను పండిస్తున్నారు. కుమురంభీం జిల్లాలోని గొల్లతరివి, కౌటల, బెజ్జురు, మంచిర్యాల జిల్లాలోని నెన్నల మండలంలోని మన్నెగూడెం, కోటపల్లి మండలంలోని కొత్తపల్లి, రాజారం, పారుపల్లి, లింగన్నపేట, నాగంపేట, ఎదుల్లబంధం, వేమనపల్లి మండలంలోని ముల్కలపేట చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, లింగంపల్లి గ్రామాలో దసలి పట్టు కాయ పండిస్తూ రైతులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ ఏడాది ఆసిఫాబాద్‌లో ఫారెస్ట్ అధికారులు దసలి పట్టు సాగుకు అనుమతించలేదు.దసలి పట్టు కాయ పంట 45 రోజుల్లో చేతికి వస్తుంది. రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండిస్తున్నారు. దసలి పట్టు కాయలో బైలొల్టిన్, ట్రైవొలి్టన్ అనే రెండు రకాలు ఉన్నాయి. బైవొల్టిన్ దసలి కాయకు ధర వెయ్యికి రూ. 2000 వేల నుంచి రూ. 2500 వేల వరకు పలుకుతుండగా ట్రైవొలి్టన్ కాయ ధర రూ. 1700 నుంచి రూ.1900 వరకు ఉంటుంది. బైవొల్టిన్ దసలి గుడ్లపై 50 శాతం సబ్సిడీ ఉండడంతో రైతులు బైవొల్టిన్ పట్టు పంటను ఎక్కువ శాతం పండిస్తున్నారు. ట్రైవొలి్టన్ గుడ్లకు (విత్తనాలకు) సబ్సిబీ ఎత్తి వేశారు. అలాగే గత ఏడాది గుడ్డు ధర రూ. 6 ఉండగా ప్రస్తుతం రూ. 12కు పెంచారు. గుడ్ల ధర రెండింతలు కావడంతో పంట సాగు ఖర్చు పెరిగిందని రైతులు పేర్కొంటున్నారు.దసలి పట్టు కాయ పంట సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. రైతుల శ్రమే పెట్టుబడి. రైతులు 2వేల నుంచి 3 వేల రూపాయలతో గుడ్లను కోనుగోలు చేస్తే సరిపోతుంది. అంతకు మించి పెద్దగా ఖర్చులు ఉండవు. గుడ్లు కొనుగోలు అనంతరం అవి పిల్లలు అయ్యేంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. గుడ్ల నుంచి పట్టు పురుగులు బయటికి వచ్చిన తర్వాత వాటిని చెట్లపై వేస్తారు. పట్టుపురుగులు ఆకులను తింటు 20 రోజులకు దసలి పట్టు కాయగా మారుతాయి. పట్టు పురుగులను పక్షులు తినకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలి. రెండు నెలల పాటు కష్టపడితే కాయ చేతికి అందుతుంది. ఒక్కో రైతు 20 నుంచి 30 వేల కాయను పండిస్తారు. దసలి కాయ మంచి దిగుబడి వస్తే ఒక్కో రైతు సంవత్సరానికి పెట్టుబడులు పోను రూ. 70వేల నుంచి రూ.80 వేలు సంపాదిస్తారు.