ఇక ఇంటర్ కాలేజీల రెగ్యులరైజేషన్
హైద్రాబాద్, డిసెంబర్ 11,
స్టూడెంట్లు లేరనే సాకుతో సర్కారీ కాలేజీలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది 50 మంది కంటే తక్కువ స్టూడెంట్స్ ఉన్న13 కాలేజీలను మూసివేయాలని ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది మరిన్ని కాలేజీలపైనా వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 404 సర్కారు జూనియర్ కాలేజీలుండగా, వీటిలో నాలుగు ఒకేషనల్ కాలేజీలు. వీటన్నింటిలో రెండు లక్షల మంది వరకూ స్టూడెంట్స్ చదువుతున్నారు. నాలుగేండ్లలో ఈ ఏడాదే ఫస్టియర్ లో లక్ష అడ్మిషన్లు దాటాయి. ఇదే సమయంలో స్టూడెంట్స్ లేని కాలేజీల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఏడాది ఫస్టియర్ లో మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ మంది చేరగా, వరంగల్ రూరల్జిల్లాలో తక్కువ మంది చేరారు. తక్కువ స్టూడెంట్లున్న కాలేజీల్లో ఎక్కువ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి.ఇప్పటికే పలు కాలేజీల్లో కోర్సులు ఎత్తివేసిన ఇంటర్ బోర్డు, సిబ్బందిని ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్ పై పంపించింది. ఎగ్జామ్స్ డేట్స్ రావడంతో ఈ టైమ్లో కాలేజీలను మూసివేస్తే ఎలా అనే ఆలోచనలో అధికారులు పడ్డారు. మరోవైపు స్టూడెంట్లు తక్కువున్న కాలేజీలను బలోపేతం చేయాలనే ఆలోచన అధికారుల్లో కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్మిషన్ల కోసం ఎలాంటి డ్రైవ్స్ నిర్వహించడం లేదు. అడ్మిషన్లు తక్కువైనా చర్యలు ఉండటం లేదు. దీంతో మాకేంటి అనే ధోరణిలో అధికారులున్నట్టు తెలుస్తోంది.అధికారిక లెక్కల ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని13 కాలేజీల్లో ఫస్టియర్లో 50లోపే అడ్మిషన్లు అయ్యాయి. ఎగ్జామ్ ఫీజు కట్టిన స్టూడెంట్స్ నే లెక్కలోకి తీసుకుంటే, ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. స్టూడెంట్లు తక్కువగా ఉన్న కాలేజీల్లో దాదాపు ఆర్ట్స్ కోర్సులే ఉన్నాయి. హైస్కూల్స్ లో కొనసాగుతుండటం, కాలేజీలకు ట్రాన్స్ పోర్ట్ సమస్యలే తక్కువ స్టూడెంట్లు ఉండటానికి కారణంగా తెలుస్తోంది. మరో 35 కాలేజీల్లో 80లోపే అడ్మిషన్లు అయ్యాయి. దీంట్లోనూ కొన్ని అడ్మిషన్లను స్టూడెంట్స్ కు తెలియకుండానే చూపించారనే ఆరోపణలున్నాయి.రాష్ట్రంలో 55 ఎయిడెడ్ కాలేజీలుంటే, వీటిలో హైదరాబాద్లోనే 27 కాలేజీలున్నాయి. స్టేట్ లోని 25 కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు తీసుకోలేదు. మరోవైపు హైదరాబాద్లోని 9 ఎయిడెడ్ కాలేజీల్లో స్టూడెంట్స్ లేకపోవడంతో అక్కడి స్టాఫ్ ను ఇతర ప్రభుత్వ కాలేజీలకు ట్రాన్స్ ఫర్ చేశారు. పోస్టుల భర్తీ నిలిచిపోవడం, గ్రాంట్స్ ను పెద్దగా ఇవ్వకపోవడంతో ఎయిడెడ్ కాలేజీల నిర్వహణకు మేనేజ్మెంట్లు ఇష్టపడటం లేదు. వచ్చే రెండు, మూడేండ్లలో మెజారిటీ ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేటు కాలేజీలుగా మారే అవకాశముంది.జిల్లాలోని ఓ కాలేజీలో చిత్రమైన పరిస్థితి. వెంకటాపూర్ జూనియర్ కాలేజీలో మొత్తం 9 మంది స్టూడెంట్స్ ఉంటే ప్రిన్సిపల్తో కలిపితే పది మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఫస్టియర్ లో అధికారుల లెక్క ప్రకారం ఏడుగురున్నా నలుగురే ఎగ్జామ్ ఫీజు కట్టారు. సెకండియర్ లో ఐదుగురు ఎగ్జామ్ ఫీజు కట్టారు. ఈ కాలేజీలో ప్రిన్సిపల్ తోపాటు ముగ్గురు కాంట్రాక్టు లెక్చరర్లు, ఇద్దరు గెస్టు లెక్చరర్లు, ఓ అటెండర్, లైబ్రరియన్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఉన్నారు. ఇటీవలే మరో ఇద్దరు అటెండెర్స్ ను వేరే కాలేజీలకు ట్రాన్స్ఫర్ చేశారు. కాలేజీ గ్రామంలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ బాగా ఉండేవారని, ఊరికి 2,3 కిలోమీటర్ల దూరానికి మార్చాక ట్రాన్స్పోర్టు లేక స్టూడెంట్లు తగ్గుతూ వచ్చారని లెక్చరర్లు చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన ఆత్మకూర్ జూనియర్ కాలేజీలో ఫస్టియర్లో 9 మంది, సెకండియర్ లో 18 మంది ఉన్నారు. ఇక్కడా సీఈసీ గ్రూప్ మాత్రమే ఉంది.