కేంద్రంపై గులాబీ దాడి...
గుదిబండగా మారుతున్న సంక్షేమ పథకాలు
హైద్రాబాద్, డిసెంబర్ 11,
కేంద్రం పన్నుల్లో రాష్ట్ర వాటా కింద నిధులను సక్రమంగా ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ మొదట్నించి ఆరోపిస్తున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కూడా ఆయన లేఖ రాశారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయాలని, లేకపోతే వాస్తవాలను వెల్లడించాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి కేంద్రం వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేసి రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వనరులను గండికొట్టే విధంగా కేంద్రం తీరు ఉందని అసెంబ్లీ వేదికగా చెప్పాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పన్నుల వాటా, జీఎస్టీ రూపంలో కూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని లెక్కలతోపాటు వివరించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.కేసీఆర్ రెండో సారి అధికారంలో వచ్చి ఏడాది కావస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలు ఇంత వరకు అమలు చేయలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఎందుకు హామీలను అమలు చేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల హమీల్లో ప్రధానంగా రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగుల పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు, ఆసరా పెన్షన్ లబ్ది దారుల వయో పరిమితి తగ్గింపు తదితర అంశాలు ఉన్నాయి. రైతు రుణమాఫీని నాలుగేండ్లలో దశల వారీగా అమలు చేస్తామని సీఎం బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. 2019–-20 బడ్జెట్ లో ఆరు వేల కోట్లను కూడా కేటాయించారు. కానీ ఇంతవరకు వాటిని విడుదల చేయలేదు. మిగతా ఎన్నికల పథకాల ఊసే లేదు. ‘‘కేంద్రం నిధులు ఇస్తుందనే ఆశించి కొత్త పథకాలను ప్రకటించాం. కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. అందుకే వాటిని ఇప్పుడు అమలు చేయడం లేదు’ అనే అభిప్రాయంలో సీఎం ఉనట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. కేంద్రం తీరు వల్లే ఎన్నికలప్పటి హామీలను అమలు చేయలేకపోతున్నామని అసెంబ్లీ వేదికగా అధికారపక్షం నేతలు దాడి చేసే చాన్స్ ఉంది. ఎన్నికల సమయంలో రైతు బంధు సాయాన్ని రూ. 4 వేల నుంచి 5 వేలకు పెంచారు. ఖరీఫ్ కాలానికి సంబంధించి ఇంకా రూ. 12 వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. రబీ పంటకు సంబంధించి ఇంత వరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఇప్పట్లో రబీ రైతు బంధు ఆశించవద్దని ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి.రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు అనేక అంశాలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తూ వచ్చింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, రాష్ట్రపతి ఎన్నిక.. ఇలా పలు అంశాల్లో కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని అప్పట్లో సీఎం కొనియాడారు. జీఎస్టీ బిల్లు అమోదం కోసం అన్ని రాష్ట్రాల కంటే ముందే అసెంబ్లీని సమావేశపరిచి బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే.. రెండోసారి కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేశాక కేంద్రంతో కొంత గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టిన సిటిజన్షిప్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలకు విప్ జారీ చేశారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై కూడా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడే చాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే దిశ కుటుంబాన్ని ఆయన పరామర్శించలేదనే విమర్శలు ఉన్నాయి. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా పేరొచ్చిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తేవాలని, కేసులను త్వరితగతిన విచారించి నిందితులకు తక్కువ సమయంలో శిక్ష పడేలా చట్టాలు ఉండాలని సీఎం అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని కోరే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు.కేంద్రం నుంచి నిధులు రావడం లేదంటూ అసెంబ్లీ వేదికగా బీజేపీపై చేసే విమర్శలకు కాంగ్రెస్ సపోర్టు ఉంటుందన్న అభిప్రాయంలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలపై కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోందని, ఇలాంటి సమయంలో కేంద్రంపై చేసే విమర్శలకు ఆ పార్టీ సభ్యుల నుంచి కూడా మద్దతు ఉంటుందనే భావనలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో బీజేపీకి ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నారు. ఆయన అడ్డు పడినా పెద్దగా సమస్య రాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు అన్నారు.