రెవెన్యూ సిబ్బందికి భద్రత.. రెవెన్యూ కార్యాలయాలలో సిసి కెమెరాలు!
హైదరాబాద్ డిసెంబర్ 11
రెవెన్యూ సిబ్బందికి భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంతమంది పోలీసులను రోజూ కార్యాలయాల వద్ద మోహరించడం కష్టం కనుక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రెవెన్యూ కార్యాలయాలలో సిసి కెమెరాలు అమర్చాలని నిర్ణయించి అందుకు టెండర్లు పిలిచింది. కార్యాలయం సైజును బట్టి ఒక్కో కార్యాలయంలో 3 నుంచి 8 వరకు సిసి కెమెరాలను అమర్చబోతున్నారు. వాటిని స్థానిక పోలీస్‌స్టేషన్‌తో అనుసంధానం చేస్తారు. అలాగే జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు, వారి మొబైల్ ఫోన్లతో కూడా అనుసంధానం చేస్తారు. కనుక రాష్ట్రంలో ఏ రెవెన్యూ కార్యాలయంలో ఏమి జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అంతేగాక ఉద్యోగులు సకాలంలో విధులకు వచ్చి సాయంత్రం వరకు పనిచేస్తున్నారా లేదా? ప్రజలతో ఏవిధంగా వ్యవహరిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. అలాగే లంచాల కోసం ప్రజలను పీడిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై కూడా ఓ కన్నేసి ఉంచవచ్చు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాలలో సిసి కెమెరాలు బిగించబడతాయని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు