YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

చికట్లో భవిత (కృష్ణాజిల్లా)

చికట్లో భవిత (కృష్ణాజిల్లా)

చికట్లో భవిత (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, డిసెంబర్ 11: జిల్లాలో దివ్యాంగుల కు అందాల్సిన ప్రత్యేక విద్య అంతంతమాత్రంగా అందుతోంది. ప్రత్యేక అవసరాల గల పిల్లలకు అందాల్సిన భత్యాలు, ఉపకరణాలు అందటం లేదు. వీరిలో అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు జరగటం లేదు. ఏటా జిల్లాలో డివిజన్ల వారీగా దివ్యాంగులలో అవసరమైన వారికి శస్త్రచికిత్సా నిర్ధరణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. కానీ శస్త్రచికిత్సలు చేయడం లేదు. లేచి నడవలేని వారికి వీల్‌ఛైర్లు, నడక సరిగా లేని వారికి కాలిపర్సు, రోలేటర్స్‌, క్రచెస్‌ వంటి ఉపకరణాలు అందటం లేదు. ఈ ఏడాది జూన్‌ నుంచి వారికి అందాల్సిన భత్యాలు అందకపోవటంతో భవిత, నాన్‌ భవిత కేంద్రాలకు ప్రత్యేక పిల్లల హాజరు శాతం తక్కువగా ఉంటోంది. 2013-14 విద్యా సంవత్సరంలో ఒకసారి ప్రత్యేక పిల్లలకు ఉపకరణాలు అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపకరణాలు అందజేయలేదు. గ్రహణం మొర్రికి మాత్రం ఏటా శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. సెరిబ్రల్‌ ఫాల్సీ, శారీరక వైకల్యం, చెవి సంబంధిత సమస్యల నివారణకు తేలికపాటి శస్త్రచికిత్సలు, గ్రహణంశూల, ప్యాలెట్‌ ఫిస్టులా, టంగ్‌ టై వంటి శస్త్రచికిత్సలను చేయించాల్సి ఉంది. ఇతర అత్యవసర శస్త్ర చికిత్సలు అవసరమైన సందర్భంలో ఐఈఆర్టీ ఉపాధ్యాయులు చొరవ తీసుకుని, స్థానిక దాతల సహకారంతో తిరుపతి బర్డు ఆసుపత్రి, దీనికి అనుబంధంగా పని చేస్తున్న ద్వారకాతిరుమల వైద్యశాలకు తీసుకెళ్లి చేయిస్తున్నారు. భవిత కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు రవాణా భత్యం నెలకు రూ.300 చొప్పున, నాన్‌భవిత కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు సహాయకుని భత్యం కింద నెలకు రూ.300, సాధారణ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల బాలికలకు నెలకు రూ.200 అందజేస్తారు. బధిర విద్యార్థులకు సహాయకునిగా ఉండి చదివి చెప్పి సహకరించే వారికి నెలకు రూ.200 అందిస్తారు. కానీ జూన్‌ నుంచి ఇవేమీ అందడంలేదు. జిల్లాలో 17 భవిత కేంద్రాలకు విజయవాడ, గుడివాడ, చల్లపల్లి మండలాల్లో భవనాల నిర్మాణం జరగాల్సి ఉంది. 33 నాన్‌ భవిత కేంద్రాలు వేర్వేరు పాఠశాలల్లో పనిచేస్తున్నాయి. వీటికి నూతన భవన నిర్మాణాలు చేపడతామంటున్నారు. సహిత విద్య రిసోర్సు ఉపాధ్యాయులు ఏటా వేసవి సెలవుల్లో 0 నుంచి 18 ఏళ్ల వయస్సున్న ప్రత్యేక పిల్లల్ని వైకల్యాల వారీగా గుర్తించి, వారికి సంబంధించిన సమాచారాన్ని తల్లిదండ్రుల నుంచి సేకరిస్తారు. బడిబయట ఉన్న ప్రత్యేక పిల్లల్ని వారి ఆవాస ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేర్పించి, వారికి సేవలు అందేలా చూడాల్సి ఉంది. పాఠశాలలకు రాలేని పిల్లలకు సహితవిద్య రిసోర్సుపర్సన్లు ఇంటి వద్దే బోధన చేస్తున్నారు. భవిత ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులతో ఫిజియోథెరఫీ, స్పీచ్‌థెరఫీ, అంధులైన పిల్లలకు మొబిలిటి, బ్రెయిలీ స్క్రిప్ట్‌ను నేర్పించి సేవలు అందించాలి. వీరికి ప్రభుత్వం అందించే పింఛన్లు పొందేలా సూచనలు చేయటం, వైద్య ధ్రువీకరణ పత్రాలు పొంది సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక ఉపకార వేతనాలు పొందేలా చూడాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో మానసిక వైకల్యం, దృష్టి వైకల్యం, శ్రవణవైకల్యం వంటి తదితర లోపాలు ఉంటున్నాయి. దీంతో సాధారణ పాఠశాలల విద్యార్థులతో పోల్చితే వెనుకబడి ఉంటారు. జిల్లాలో 8 వేల మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. వీరిలో 500 మంది ఇంటివద్దే చికిత్స అందించాల్సిన అతి తీవ్ర మానసిక వైకల్యం కలిగినవారు ఉన్నారు. జిల్లాలోని 50 మండలాల్లో 99 మంది ఐఈఆర్టీ ఉపాధ్యాయులు, 17 మంది వ్యాయామ వైద్యులు ఒప్పంద ప్రాతిపాదికన పనిచేస్తున్నారు.  ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకానికి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ ఇంకా నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక ఉపాధ్యాయ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు విభజన తరువాత రాష్ట్రానికి 860 వచ్చాయి. వీటిలో 158 ప్రస్తుతం ఎస్జీటీలుగా పనిచేస్తూ ప్రత్యేక బీఈడీ అర్హత ఉన్న వారికి కేటాయించారు. జిల్లాకు 20 పోస్టులు ఈ కేటగిరీలో వచ్చాయి. వీటిలో ఏడు భర్తీ కాగా 13 ఖాళీ ఉన్నాయి. విద్యార్థుల నిష్పత్తిని బట్టి ప్రతి పది మంది ప్రత్యేక పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఇచ్చారు. కానీ ప్రత్యేక ఉపాధ్యాయులు ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి పిల్లలకు పని చేస్తున్నారు. ఈ అంతరాన్ని తొలగించి అవసరాల మేరకు విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయుల భర్తీ జరపాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

Related Posts