YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 కసరత్తు (ప్రకాశం)

 కసరత్తు (ప్రకాశం)

 కసరత్తు (ప్రకాశం)
ఒంగోలు, డిసెంబర్ 11 రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల అమలులో భాగంగా గూడు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే ఉగాది నాటికి అర్హులకు ఇంటి పట్టా అందించాలన్న లక్ష్యంతో ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఎంత మందికి ఇళ్ల స్థలాలు లేవో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు గుర్తించారు. వారికి స్థలం ఇచ్చేందుకు కొన్ని గ్రామాల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించగా- అవి అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాన్ని సేకరించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఉగాది సమీపిస్తుండటంతో తుది విడతగా భూములను గుర్తించే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. పక్కాగృహం మంజూరు కోరుతూ అర్హులైన పేదల నుంచి ప్రతి సోమవారం జిల్లా వ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాలు, కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో అర్జీలు వస్తుంటాయి. ఆయా అర్జీల పూర్తి వివరాలను రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సిస్టంకు అనుసంధానం చేశారు. వాటితో పాటు ఇటీవల గ్రామ, వార్డు వాలంటీర్లతో సర్వే చేయించి అర్హుల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 1.13 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు చొప్పున ఇంటి పట్టా ఇవ్వనున్నారు. అందుకు 2,500 ఎకరాల భూమి అవసరమని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 1,200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపిక చేశారు. మరో 1,300 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ప్రతి మండలంలోనూ సగం గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేదని రెవెన్యూ అధికారులు నివేదించారు. భూమి లేని పక్షంలో ప్రైవేటు భూమి కొనుగోలు చేసైనా ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. కేవలం పట్టాలు ఇవ్వడమే కాకుండా... ఆ కుటుంబంలోని మహిళ పేరు మీద స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసే యోచన ఉంది. అందరికీ ఇళ్ల స్థలాల మంజూరు నిమిత్తం ఎంపిక చేసిన లబ్ధిదారులకు నివేశన స్థలాల కేటాయింపు నిమిత్తం భూ సేకరణే ప్రధాన సమస్యగా మారింది. ప్రతి కుటుంబానికి గ్రామాల్లో ఒక్కటిన్నర సెంటు స్థలం ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన. లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఎక్కువ విస్తీరణంలో ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉండటంతో నిధుల కేటాయింపుపైనే అందరిలో సందేహాలు ఉన్నాయి. మా రెవెన్యూ గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమి లేదంటూ వీఆర్వోలు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన చోట.. ఆ గ్రామ దస్త్రాలను మరోసారి ఉన్నతాధికారులు పరిశీలించే పనిలో పడ్డారు. 

Related Posts