YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

సహకారం బలోపేతం (కరీంనగర్)

సహకారం బలోపేతం (కరీంనగర్)

సహకారం బలోపేతం (కరీంనగర్)
కరీంనగర్, డిసెంబర్ 11 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల పునర్విభనజకు తగినట్లుగా మరిన్ని సంఘాలను కొత్త జిల్లాలో పెంచేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 45 ఆధారంగా మరిన్ని సంఘాలు కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటవనున్నాయి. జిల్లాల్లో ఏర్పాటైన కొత్త మండలాలు సహా అవసరమైన పెద్ద గ్రామాల్లో వీటి ఏర్పాటు దిశగా పచ్చజెండా ఊపడంతో వీటి ప్రగతిపై ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రైతులకు ఊతమిచ్చేలా ఎన్నో కార్యక్రమాల నిర్వహణతో బలోపేతమవుతున్న సంఘాలకు తోడుగా కొత్త సంఘాలు కొలువుదీరనున్నాయి. వచ్చే నెల రోజుల్లోగా ఇందుకు అవసరమైన ప్రక్రియకు మార్గం సుగమమవడంతో జిల్లాలోని ఆయా మండలాల్లోవీటి ఏర్పాటు దిశగా ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతమున్న 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు కొత్తగా ఆరు చోట్ల ఏర్పాటు చేసే దిశగా సహకార శాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం జిల్లా సహకార శాఖ గతంలోనే ప్రతిపాదనల్ని పంపించింది. జిల్లాల విభజన తరువాత కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌ అర్బన్‌ మండలం మినహాయించి 15 మండలాల పరిధిలో మండలానికి సగటున రెండు చొప్పున వీటి సేవలు  అందుతున్నాయి. కొత్త మండలాలు ఏర్పాటైనప్పటికీ గతంలోనూ ఒకే మండలంలో రెండు మూడు సంఘాలు ఉండటంతో రైతులకు అందే స్వల్ప, దీర్ఘకాలిక రుణాలతోపాటు ఎరువుల వ్యాపారం, పెట్రోల్‌ పంపుల నిర్వహణతో లాభసాటి వ్యాపారాల్ని ఆయా సంఘాలు కొనసాగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులతోపాటు ఆయా సంఘాల పరిధిలో ఉన్న గ్రామాల సంఖ్య ఆధారంగా కొత్త మండలాల్లో మరో ఆరింటి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తాజాగా విడుదలైన జీవో ఆధారంగా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలోగా వీటి ఏర్పాటు అనివార్యంగా మారింది. కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి, నాగులమల్యాల, గన్నేరువరం మండలంలో గన్నేరువరం, గున్కుల కొండాపూర్‌, చిగురుమామిడి మండలంలో ఇందుర్తి, వీణవంక మండలంలో వీణవంక గ్రామాల్లో కొత్త సంఘాల్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటి ఏర్పాటు వల్ల 33 గ్రామాల పరిధిలోని 23,957మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో ఇప్పటికే 5420మంది రైతులు పాత సంఘాల పరిధిలో సభ్యులున్నారు. వీరితోపాటు మరికొంతమందిని చేర్చుకోవడంతోపాటు సంఘాల్ని బలోపేతం చేసే చర్యలు కనిపించనున్నాయి. సంఘాలను అర్థికంగా ప్రగతిపథంలో పయనించేలా చూడటంతోపాటు ఇతర రాష్ట్రల్లోని సంఘాల మాదిరిగా ఆదర్శవంతగా నిలపాలనే ప్రయత్నంలో కొత్తవాటి ఏర్పాటుకు సర్కారు పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లాలో ఇప్పుడున్న సంఘాల లావాదేవీలు పెరగడంతోపాటు రైతులకు పూర్తిస్థాయిలో రుణ సహకారం అందే వీలుంటుంది. ప్రస్తుతం జిల్లాలోని ఈ మొత్తం సంఘాల ద్వారా 15,414మంది రైతులకు స్వల్పకాలిక రుణాలుగా రూ.89.14కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద 3,352మందికి రూ.53.77కోట్లు అందించి సాగుకు ఊతమిచ్చే చర్యలు కనిపించాయి. ఇక ఆయా సంఘాల ద్వారా  రూ.3.93లక్షల విత్తనాల వ్యాపారంతోపాటు రూ.6.01 కోట్ల ఎరువుల వ్యాపారాన్ని సంఘం సభ్యులు నిర్వహించారు. గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, చొప్పదండి, మెట్పల్లి, వెన్నెంపల్లి, జమ్మికుంట, దుర్శేడ్‌ సంఘాలు పెట్రోల్‌ బంకుల నిర్వహణతో మంచి లాభాల్ని ఆర్జిస్తున్నాయి. అదేకాకుండా ఈ ఏడాది రబీలో(2018-19) సీజన్‌లో 140 కొనుగోలు కేంద్రాలను ఈ పీఏసీఎస్‌ల పరిధిలో ఏర్పాటు చేసి 31.92లక్షల క్వింటాళ్ల వరిధాన్యం కొనడం జరిగింది. వీటిద్వారా లక్షలాది రూపాయల కమీషన్‌ సంఘాలకు లభించింది. త్వరలో పెరుగనున్న వాటి ద్వారా కూడా మెరుగైన సేవలు రైతులకు అందనున్నాయి.

Related Posts