సారా ఏరులు (తూర్పు గోదావరి)
కాకినాడ,డిసెంబర్ 11 జిల్లాలో నాటుసారా ఏరులై పారుతోంది. ఇదో కుటీర పరిశ్రమలాగా ఊరూవాడా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గతం మాదిరిగానే గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర, పట్టణ ప్రాంతాల్లో సారా రక్కసి కోరలు చాస్తోంది.. గత రెండు నెలల్లో భారీగా నాటు సారా కేసులు నమోదయ్యాయి. నాటుసారా బారినపడి పేద కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అబ్కారీ శాఖ అధికారులు కొంతవరకు నియంత్రిస్తున్నా.. సిబ్బంది కొరత కారణంగాపూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రవేశపెట్టి.. మద్య నిషేధం దిశగా చర్యలు చేపడుతున్నామని చెబుతోంది.. అందుకు అనుగుణంగా దుకాణాల సంఖ్యను తగ్గించడం, మద్యం ధరలను పెంచడం వంటి చర్యలు చేపట్టింది. అమ్మకాల సమయాన్ని సైతం తగ్గించింది. ఈ పరిస్థితిని నాటుసారా తయారీదారులు, విక్రయదారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారా..? అంటే అవుననక తప్పదు.. ఎందుకంటే రెండు నెలలుగా నమోదవుతున్న నాటుసారా కేసులు అధికమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాజమహేంద్రవరం నగరంలోని క్వారీమార్కెట్ సెంటర్, సోమాలమ్మగుడి, తాడితోట, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వెంకటనగరం, రాజానగరం, పిడింగొయ్యి, మోరంపూడి తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కాకినాడ గ్రామీణం, ఆత్రేయపురం, కొత్తపేట, రాయవరం తదితర ప్రాంతాల్లో సైతం సారా తయారీ, విక్రయాలు అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో పట్టుబడిన వారే మళ్లీ దొరుకుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్కరిపై అయిదు నుంచి 10 కేసుల వరకు నమోదై ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో కూడా సారా తయారీ ఎక్కువైంది. ప్రధానంగా గతంతో పోల్చితే అబ్కారీ శాఖ సిబ్బంది కొరత సమస్య ఎదుర్కొంటోంది. మరోవైపు బెల్టుదుకాణాలను సైతం పూర్తిగా నిర్మూలించారు. వీటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలల్లో 20కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కొందరు సారావైపు మొగ్గుచూపుతున్నారు. ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా సారా తయారీని, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఎక్సైజ్ అధికారులకు సారా తయారీపై ఎక్కడి నుంచైనా సమాచారం వస్తే తక్షణమే స్పందించి వెళ్లలేని పరిస్థితి. ఉన్న సిబ్బందిని సమీకరించుకుని వెళ్లేలోపే పుణ్యకాలం పూర్తవుతోంది. రాజమహేంద్రవరం యూనిట్ పరిధిలో ఏడు స్టేషన్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన సిబ్బంది రాయవరం నుంచి భద్రాచలం సరిహద్దు వరకు పర్యవేక్షించాలి. ఇందులో రంపచోడవరం, చింతూరు కేంద్రాల పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు,, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, 15 మంది కానిస్టేబళ్లు ఉన్నారు. సీఐ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు 60 మంది ఉండాల్సి ఉండగా కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో నాటు సారా తయారీ, విక్రయాల కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు నాలుగు లక్షల జనాభా ఉన్నారు. కానీ టాస్క్‌ఫోర్స్, ఇతర విభాగాల సిబ్బంది కలిపి 50 మందికి మించి లేరు. అమలాపురం, కాకినాడ యూనిట్లలోనూ ఇదే పరిస్థితి. దీంతో సారావిక్రయాలు పెరిగినా పూర్తిస్థాయిలో అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. సరిపడినన్ని వాహనాలు కూడా లేవు. జిల్లా వ్యాప్తంగా మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌కు 15 వాహనాలు అవసరం కాగా కేవలం పదేసి చొప్పునే ఉన్నాయి.