భయపడుతున్న ప్రేమోన్మాదులు
వరుసగా ఆత్మహత్యలు
హైద్రాబాద్, డిసెంబర్ 11,
తెలంగాణలో ‘దిశ’ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత కామాంధులు, ప్రేమోన్మాదుల్లో ఆందోళన నెలకొంది. మహిళలపై దాడులకు పాల్పడిన నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలను చూస్తూ అది నిజమనే తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లిలో భార్య, కుమార్తె సహా నలుగురిపై టర్పంటైన్ పోసి సజీవ దహనానికి పాల్పడిన నిందితుడు లక్ష్మీరాజ్యం ఆదివారం ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ప్రియురాలిని గొంతు కోసి చంపిన కేసులో నిందితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాగాలకు చెందిన జాదవ్ అరవింద్(23) తల్లిదండ్రులతో కలిసి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం వినాయక్‌నగర్‌లో ఉంటున్నారు. అతడి ఇంటికి సమీపంలోనే టెన్త్ క్లాస్ విద్యార్థినిని ప్రేమ వ్యవహారం నడిపాడు.అయితే ఆమె వేరే యువకుడితో చనువుగా ఉండడాన్ని సహించలేకపోయిన అరవింద్ 2018, ఆగస్టు 30న బాలిక ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.కొద్దిరోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన అరవింద్ నాందేడ్‌లోని ఓ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ‘దిశ’ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో అరవింద్‌లో భయం మొదలైంది. తనకూ అలాంటి శిక్ష తప్పదేమోనన్న ఆందోళనతో సోమవారం ఉదయం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి కొన్ని గంటలకు ముందుకు ప్రియురాలితో దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి.. ‘నీవు లేనిదే నేను బంగారం’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న అరవింద్‌ను చూసి తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.