కోరలపూర్ణిమ
మార్గశిర పూర్ణిమను తెలుగు దేశంలో కోరల పూర్ణిమ అంటారు. కోరల పున్నమి అంటే, కోరల అమ్మవారి పున్నమి. ఈ కోరల అమ్మవారు యముని వద్ద ప్రధాన లేఖకుడైన చిత్రగుప్తుని సోదరి. ఆమె కోటి పుర్రెల నోము పడుతుందట. కానీ, ఏటా ఒక పుర్రె లోటు వస్తుందట. అందుచేత మళ్లీ సంవత్సరం మళ్లీ ఆ నోము పడుతుందట. అప్పుడు ఇట్లాగే నోము అసంపూర్తి. ఏటేటా ఇదే వరస. ఇది పురాణ కథనం. కానీ, నిష్టతో 33 పున్నాల నోము పట్టే వారు కూడా ఈ పున్నమి నాడు ఏమీ చేయరు. అది ఒక కట్టుబాటు. కాగా, ఈ పున్నమి నాడు ఆంధ్ర ప్రాంతాలలో అతి ప్రాచీన కాలం నుంచి ‘రొట్టెలు కొరికి కుక్కలకు వేయుట’ అనే ఆచారం ఒకటి పరంపరగా వస్తోంది. ఇలా రొట్టెలు కొరికి వేయడం ద్వారా యముని కోరల్లో ఉండే విషం పోతుందని విశ్వాసం. మహా మార్గశీర్ష అనే పేరు గల ఈ పున్నమి నాడు నరక పూర్ణిమ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతా మణి చెబుతోంది. నరక అనే పదం యమ సంబంధమైనది. వైద్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ మొదలు మార్గశిర పూర్ణిమ వరకు గల 30 దినాలను యమదంష్ట్రలు అంటారు. అంటే ఈ రోజులలో యముడు కోరలు తెరుచు కుని ఉంటాడని భావం. ఈ రోజులు చాలా అనారోగ్యకారకాలైనవి. మార్గశిర పూర్ణిమతో యమదంష్ట్ర దినాలు ముగుస్తాయి.